వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తాను.. అని ఇదివరకూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.ఇప్పుడు మరోసారి పవన్ అనంతపురం వెళ్తున్నారు. ఈ నెల 15వ తేదీన పవన్ అనంతపురం సభకు వస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ ప్రకటించారు. సీపీఐ, సీపీఎం, జనసేనల ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుందని ఆయన ప్రకటించారు. జనసేన తరఫున అంశం గురించి ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రాకపోయినా రామకృష్ణ ఈ విషయాన్ని ప్రకటించేశారు. చాలా కాలం కిందటే పవన్ ఆ ప్రకటన చేశారు. ఆ మేరకు పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం విషయంలో చాలా ఊహాగానాలు చెలరేగాయి. అనంతపురం టౌన్ నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తారని, కాదు.. కదిరి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే పవన్ ఇంత వరకూ నియోజకవర్గం విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.అయితే ఆ తర్వాత మరోసారి అనంతపురం పర్యటనకు వెళ్లారాయన. కొంత కాలం కిందట పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లాలో రెండు మూడు రోజుల పాటు పర్యటించారు. గుత్తితో మొదలుపెట్టి, అనంతపురం, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల్లో పవన్ పర్యటన సాగింది. ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నేతలతో పవన్ సమావేశం అయ్యారప్పుడు. ప్రస్తుతం జనసేన, కమ్యూనిస్టు పార్టీలు సన్నిహితంగా మెలుగుతున్న నేపథ్యంలో.. పవన్ తరఫున రామకృష్ణ ప్రకటన చేసి ఉండవచ్చు. ఇప్పుడు పవన్ అనంతపురం వెళ్తే.. తన పోటీ విషయంలో స్పష్టమైన ప్రకటన చేస్తారా? అనేది ఆసక్తిదాయకమైన అంశం. తను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి!