సెన్సేషనలిజం, తప్పుదోవ పట్టించడం, ప్రచారార్భాటం.. ఇవాళ్టి వార్తలలో ఎక్కువగా ఇవే కనపడుతున్నాయి. అంతేకాని ప్రజల అవసరాలు, ఉపయోగాలు పట్టడంలేదనే విమర్శ ఎప్పటినుంచో వినపడుతోంది. సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి వార్తలకు కొదవే లేకుండా పోయింది. దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్.. దీనిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఈ ఏడాది తొలిరోజే చెప్పారు. 2018లో తాము చేస్తున్న రెండో అతిపెద్ద అప్‌డేట్ ఇదేనంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు జుకర్‌బర్గ్. విశ్వసనీయ వార్తలను అందించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయన్నారు ఆయన. ఫేస్‌బుక్ యూజర్ల ద్వారానే ఏది విశ్వసనీయమో.. ఏది కాదో తేల్చనున్నట్టు చెప్పారు. తొలుత ఈపని బయటి సంస్థలకు అప్పగిద్దామనుకున్నామని.. అయితే అది కూడా సరైన ఫలితాలు ఇవ్వదనుకుని.. ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. చాలా వార్తా సంస్థలు.. తమ ప్రేక్షకుల అభిప్రాయాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నాయని.. అదే బాటలో తాముకూడా నడవాలనుకుంటున్నామని తెలిపారు.
తాము తీసుకొస్తున్న కొత్త అప్‌డేట్ వార్తల సంఖ్యను తగ్గించదని.. కానీ ఏది నాణ్యమైన వార్తో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. దీనివల్ల అత్యున్నతమైన వార్తలను అందించడానికి వీలవుతుందన్న నమ్మకం తనలో కలుగుతోందని జుకర్‌బర్గ్ చెప్పారు.