ఇక కరెంట్ రీడింగ్ షురూ
హైద్రాబాద్, జూన్ 3,
లాక్‌డౌన్ నేపథ్యంలో రెండు నెలలుగా (ఏప్రిల్, మే) విద్యుత్ మీటర్ రీడింగ్ జరగలేదు. ప్రస్తుతం 5వ దశ లాక్ డౌన్ లో ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చింది. దీంతో నగరంలో విద్యుత్ బిల్లుల జారీ మళ్లీ మొదలు కానుంది. నేటి నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుండడంతో దీనికోసం టిఎస్‌ఎస్పిడిసిఎల్ అధికారులు ఏర్పాట్లు చేశారు.విద్యుత్ మీటర్ రీడర్లు ప్రతి రోజు గరిష్టంగా 300 ఇళ్లకు తిరిగి బిల్లులు జారీ చేస్తారు. అపార్ట్‌మెంట్లయితే ఒక్కోరోజు 500 వరకు సైతం బిల్లులు జారీ చేస్తారు. అయితే తాజా పరిస్థితుల్లో మీటర్ రీడర్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని డిస్కం అధికారులు సూచిస్తున్నారు.ప్రస్తుత మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి కొంతమంది బిల్లులను చెల్లించగా, మరికొంత మంది చెల్లించలేదు. దీని దృష్ట్యా అధికారులు పలు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆయా స్పాట్ బిల్లింగ్ మీటర్ రీడర్లల్లో ఆయా డేటాను లోడింగ్ చేసి అందుబాటులో ఉంచుతున్నారు. మార్చి, ఏప్రిల్, మే మూడు నెలల్లో వినియోగించిన మొత్తాన్ని రీడింగ్‌ను నమోదు చేస్తారు. మీటర్ రీడింగ్ తీసిన తర్వాత మొత్తం యూనిట్లను మూడు నెలలతో భాగించి ఒక్కో నెలకు ఎంత చెల్లించాలో యావరేజీ బిల్లుగా తేల్చుతారు. ఆ తర్వాత ఇది వరకే ప్రొవిజినల్ బిల్లు కట్టి ఉంటే వాస్తవిక బిల్లు నుంచి ఆయా మొత్తాన్ని మినహాయించి కొత్త బిల్లును జారీ చేస్తారు. ఒకవేళ 2019 మార్చి, ఏప్రిల్ నెలల ప్రొవిజినల్ బిల్లు కన్నా ప్రస్తుత బిల్లు కంటే అధికంగా చెల్లిస్తే మైనస్ బిల్లు, తక్కువ చెల్లించి ఉంటే వాస్తవిక బిల్లులను జారీచేస్తారు. మైనస్ బిల్లు జారీ అయితే ఎంత అదనంగా చెల్లించారో ఆయా మొత్తాన్ని తర్వాత నెలల్లో జారీచేసే వాస్తవిక బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు. తక్కువ చెల్లించిన వారు, అసలే చెల్లించని వారు మాత్రం వాస్తవిక బిల్లు ప్రకారమే చెల్లించాల్సి ఉంటుంది.