మద్యం ఆదాయం..అంతంత మాత్రం
హైద్రాబాద్, జూన్ 3,
లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ఆదాయం పుంజుకోలేదు. వస్తు సేవల పన్ను (జిఎస్ టి) వసూళ్లు, మద్యం అమ్మకాలు, రిజిస్ట్రేషన్‌లతో ఆశించిన మేర ఆదాయం రాలేదని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి.సగటున నెలకు రూ.12 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉంటే ఈ నెలకు రూ.4 వేల కోట్ల వరకే ఆదాయం వచ్చినట్లు పేర్కొంటున్నారు. ఇందులో కేంద్ర పన్నుల్లో నుంచి వచ్చిన రూ.982 కోట్లు కూడా ఉంటాయని తెలిపారు. కేంద్రం ఇచ్చిన సడలింపులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు సడలింపులు ఇచ్చింది. అయితే ఈ నెల 6వ తేదీన గ్రీన్, ఆరెంజ్ జోన్‌లలో ఆ తరువాత 19వ తేదీ నుంచి అన్నిచో ట్ల పూర్తిస్థాయిలో వ్యాపార కార్యకలాపాలు పునః ప్రారంభమయ్యాయి. అయితే ప్రజలు పెద్దగా బయటకు రాకపోవడంతో జిఎస్‌టి వసూళ్లు అంత గా లేవని ఆర్థిక శాఖ అధికారి ఉన్నతాధికారి ఒక రు పేర్కొన్నారు. కేవలం ఒక్క జిఎస్‌టితోనే రాష్ట్రానికి నెలకు సగటున రూ.4500 కోట్ల నుంచి రూ. 5500 వేల కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉంటుందన్నారు.అదే సమయంలో రెండు నెలలు ఖాళీ గా ఉండటం, కొందరు ఉద్యోగాలు కోల్పోవడం, చాలా కంపెనీలు జీతాలు చెల్లించకపోగా, కొందరికి సగం వేతనాలే అందడంతో అత్యవసరమైనవి తప్ప వేరే వాటిని కొనేందుకు జనాలు ముందుకు రాలేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో క్రమంగా మార్కెట్ పుంజుకుంటుందని, ప్రజల కొనుగోలు శక్తి పెరిగి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక రిజిస్ట్రేషన్‌ల విషయానికొస్తే నెలకు సగటున రూ.500 కోట్ల మేర రాబడి వస్తుంది. అయితే సడలింపులు ఇచ్చిన నాటి నుంచి ఈ నెలఖారుకు రూ.250 కోట్ల లోపే ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. మాములు సమయంలో రోజుకు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మధ్యలో రిజిస్ట్రేషన్‌ల ద్వారా ఖాజనాకు వస్తుండగా, ఇప్పుడు రూ.7 కోట్ల వరకే ఉంటుంది.పెట్రోల్, డిజిల్ అమ్మకాలు కూడా గత 15 రోజుల నుంచే పుంజుకున్నాయి. దీనిద్వారా రావాల్సిన ఆదాయం కూడా తక్కువే వచ్చింది. ప్రధానంగా మద్యం అమ్మకాల ద్వారా కనీసం రూ.2 వేల కోట్ల మేర రాబడి ప్రభుత్వానికి వస్తుందని అంచనా వేసినప్పటికీ అది సగానికే పరిమితమైందని అబ్కారీ శాఖ ఉన్నతాధికారి ఒకరు మన తెలంగాణకు చెప్పారు. ఈ నెల 7వ తేదీ నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం లిక్కర్, బీర్ ధరలను పెంచి విక్రయాలు పునఃప్రారంభించింది. అయితే రెండు రోజులు మాత్రమే జోరుగా మంద్యం అమ్మకాలు జరిగాయని, ఆ తరువాత సాధారణం కంటే తగ్గాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకు రెండు కారణాలను వారు విశ్లేషిస్తున్నారు. లాక్‌డౌన్‌తో జనాలు ఆదాయం కోల్పోవడంతో ఎక్కువగా లిక్కర్ వినియోగం జరగలేదని, పబ్‌లు, రెస్టారెంట్లు, వీకెంట్ పార్టీలు వంటివి లేకపోవడం కూడా మద్యం అమ్మకాలపై ప్రభావం చూపాయంటున్నారు.ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లకే రూ.3 వేల కోట్ల పైచిలుకు వెళ్తాయి. రాష్ట్రం ఏడాదికి రూ.37,400 కోట్ల అప్పు చెల్లించాల్సి ఉంటుంది. అంటే సగటున నెలకు రూ.3400 కోట్లు అప్పులకే కట్టాల్సి ఉంటుంది. ఈ కిస్తీలు వాయిదా వేయాలని కేంద్రానికి పలుమార్లు సిఎం స్వయంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. ఈ నెలలో కూడా ప్రభుత్వం రూ.4 వేల కోట్ల మేర అప్పులు తీసుకుంది. అయితే జూన్ నెలలో పరిస్థితిలో మార్పు వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది. ప్రజల కొనుగోలు శక్తి పెంచడమే లక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.