పుల్వామా సూత్రధారి..ఫౌజీభాయ్ హతం
న్యూ ఢిల్లీ జూన్ 3
ఫౌజీభాయ్. ఇటీవల కశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు ఇతనే కీలక వ్యూహాకర్త. పాక్‌తో ఉన్న నియంత్రణ రేఖ వద్ద జరుగుతున్న అల్లర్లకూ మూల వ్యక్తి ఇతను. 2019లో జరిగిన పుల్వామా దాడికి ప్రధాన వ్యూహాకర్త కూడా ఫౌజీభాయ్. పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ టాప్ కమాండర్‌గా ఫౌజీభాయ్ .. కశ్మీర్‌లో అనేక ఆపరేషన్లు చేపట్టాడు. అయితే ఇవాళ పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఫౌజీభాయ్‌ని భద్రతా దళాలు తుదముట్టించాయి. దక్షిణ పుల్వామాలోని కంగన్ గ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఫౌజీభాయ్ హతమయ్యాడు. జైషే మిలిటరీ చీఫ్ అబ్ధుల్ రౌఫ్ అస్గర్ ఇతన్ని రిక్రూట్ చేశాడు. 2018లో పాక్ ఇతన్ని భారత్‌లోకి పంపించినట్లు తెలుస్తోంది.కశ్మీర్ ఇంటెలిజెన్స్ పోలీసుల రికార్డులో ఫౌజీభాయ్‌కు పలుపేర్లు ఉన్నాయి. ఫౌజీభాయ్, అబ్దుల్ రెమ్మాన్, ఇద్రిస్, హైదర్, లంబూ అనే పేర్లతో అతన్ని పిలుస్తుంటారు. ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్రిస్‌తో పాటు జాహిద్ మన్జూర్ వాణి, మన్జూర్ అహ్మద్ కార్‌లు కూడా హతమయ్యారు. 2017లో ఈ ఇద్దరూ జైషేలో చేరారు. కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ నేతృత్వంలో సాగిన ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ద్వారా ఫౌజీభాయ్ సమాచారం బహిర్గతమైంది. తన ఆపరేషన్స్ కోసం ఫౌజీభాయ్ ఎప్పుడూ మొబైల్ ఫోన్ ఆపరేట్ చేయలేదు. ఇతర కమర్షియల్ నెట్‌వర్క్స్‌ను కూడా అతను వినియోగించలేదు. కేవలం నమ్మకమైన కొరియర్ల ద్వారానే అతను సమాచారం చేరవేసేవాడు. ఎన్‌క్రిప్ట్ చేసిన శాటిలైట్ ఫోన్‌సెట్‌తోనే ఫౌజీభాయ్ ఉగ్ర సంస్థ జైషేతో సంప్రదించేవాడని తేలింది. స్థానిక తెగలను సూసైడ్ దాడులకు ప్రోత్సహించడంలోనూ ఫౌజీభాయ్ కీలకంగా వ్యవహరించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. అఫ్జల్ గురు నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. పుల్వామాలో గత వారం పేలుడు పదార్ధాలతో ఉన్న ఓ కారును సీజ్ చేశారు. అయితే ఆ కారు డ్రైవర్‌ను ఎవరు రిక్రూట్ చేశారన్న కోణంలోనూ విచారణ సాగుతున్నది. ఫౌజీబాయ్ ఆ డ్రైవర్‌ను రిక్రూట్ చేసి ఉంటారని ఇంటెలిజెన్స్ అనుమానిస్తున్నది.