సోషల్ మీడియాపై నిఘా
విజయవాడ, జూన్ 3,
ప్రతి జిల్లాలో సోషల్ మీడియాపై నిఘా పెట్టామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఎవరైనా హద్దులు దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో న్యాయస్థానాల మీద కామెంట్స్ చేయడంపై డీజీపీ స్పందించారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారని, ఈ సమయంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువైందన్నారు. ఈ తరుణంలో అన్ కంట్రోల్‌గా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడితే వయస్సుతో సంబంధం ఉండదని, ఏ వయసువారు పెట్టినా నేరంగానే పరిగణిస్తామని ప్రకటించారు. జువైనల్‌కు మాత్రమే కొన్ని నేరాలకు మినహాయింపులు ఉంటాయని సవాంగ్ తెలిపారు.పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకెళ్తున్నామని, పోలీస్‌శాఖలో తొలిసారిగా వీక్లీఆఫ్ కల్పించామని తెలిపారు. స్పందన పోర్టల్ ద్వారా ప్రజలకు, పోలీసులకు మధ్య దూరం తగ్గిందన్నారు. అలాగే ఇప్పటి వరకు 4 లక్షల మంది దిశ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారని సవాంగ్ తెలిపారు.కరోనా సమయంలో డయల్ 100, 112 ఎంతో ఉపయోగపడ్డాయని డీజీపీ సవాంగ్ తెలిపారు. టెక్నాలజీ వాడకంలో మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. విజయవాడ పటమట గ్యాంగ్ వార్ ఘటన దురదృష్టకరమని, వీటికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.