క్వారంటైన్ లలో డాక్టర్ల సేవలు...
ఈఎస్ ఐలో స్పెషాల్టీల కొరత
విజయవాడ, జూన్ 4,
విజయవాడ నగరంలోని ఇఎస్‌ఐ ఆస్పత్రికి చెందిన ఆరుగురు స్పెషాలిటీ వైద్యులను కృష్ణా జిల్లాలోని వివిధ క్వారంటైన్ కేంద్రాల్లో సేవలందించేందుకు పంపించాల్సిందిగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నుండి ఇఎస్‌ఐ సూపరింటెండెంట్‌కు ఆదేశాలు వచ్చాయి. క్వారంటైన్ కేంద్రాల్లో వైద్యలందించేందుకు స్పెషాల్టీ వైద్యుల అవసరం ఉన్నా, ఇఎస్‌ఐ స్పెషాల్టీ వైద్యులను తరలించాలనే నిర్ణయం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇఎస్‌ఐకి వచ్చే రోగులకు స్పెషాల్టీ సేవలు దూరం కానున్నాయి. ఇఎస్‌ఐ తరుఫున ప్రయివేట్ ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స చేయించుకోవాలన్నా స్పెషాల్టీ వైద్యులు రిఫర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రయివేట్ ఆస్పత్రిలో చిక్సిత కోసం రోగులే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల రోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. ప్రతిరోజూ 4 జిల్లాల నుంచి 400 మందికిపైగా రోగులు విజయవాడ ఎస్‌ఐ ఆస్పత్రికి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతోపాటు ఏలూరు ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. రాష్ట్ర విభజన తరువాత ఇంకా అదనంగా విభాగాలను ఏర్పాటు చేసి సేవలను విస్తృతం చేశారు. ఇఎస్‌ఐ పరిధిలో ఉన్న చిరుద్యోగులకు, కార్మికులకు, వారి కుటుంబాలకు చెందిన వారికి ఇక్కడే వైద్యం అందిస్తున్నారు. ప్రతిరోజూ 400 నుంచి 450 మంది వరకు అవుట్ పేషెంట్లు వస్తారు. చిన్నపిల్లలు, గైనిక్, ఆప్తమాలజీ, చెస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఇఎన్‌టి, చర్మవ్యాధులు తదితర స్పెషాలిటీ విభాగాలకు రోగులు అధికంగా వస్తుంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇఎస్‌ఐకి వస్తున్న రోగుల సంఖ్య తక్కవగా ఉన్నా, లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశాక వారి సంఖ్య పెరగనుంది. ఈ నేపథ్యంలో స్పెషాల్టీ వైద్యులు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్వారంటైన్ కేంద్రాల్లో వైద్య సేవలందించిన తరువాత వైద్యులు 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో చిన్నపాటి లక్షణాలు కనిపించినా రోగుల భద్రత దృష్ట్యా మరో 14 రోగులు హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఆ సమయంలో కూడా ఇఎస్‌ఐ రోగులకు వారి సేవలు అందవు. దీనివల్ల ఇఎస్‌ఐలో స్పెషాలిటీ వైద్య సేవలు ఎక్కువ రోజులు నిలిచిపోనున్నాయి. లాక్‌డౌన్‌లో సడలింపులు రావడంతో ఇఎస్‌ఐకి రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్వారంటైన్ కేంద్రాల్లో సేవలందించేందుకు ఇక్కడి వైద్యులు వెళితే ఇఎస్‌ఐ ఆస్పత్రిలో స్పెషాలిటీ వైద్య సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా ఇఎస్‌ఐ వైద్యులను క్వారంటైన్ కేంద్రాల్లో సేవల కోసం పంపాలనే ఆదేశాలను పునర్ పరిశీలించాలని కోరుతూ డిఎం అండ్ హెచ్‌ఒకు, జిల్లా ఆరోగ్య శాఖకు మెయిల్ పంపించారు