YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 వెలవెలబోయిన సంత (విజయనగరం)

 వెలవెలబోయిన సంత (విజయనగరం)

 వెలవెలబోయిన సంత (విజయనగరం)
విజయనగరం, జూన్ 03  ఎంత దూరమైనా, సరకులు ఎంత భారమైనా గిరిజన ప్రాంతాల్లో వారపు సంతలకు వేలాదిగా ప్రజలు హాజరవుతారు. సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇక్కడ అమ్ముకొని, కావాల్సిన సరకులు కొనుగోలు చేసుకొని గూడేలకు చేరుకుంటారు. గిరిబిడ్డలకు ఈ సంతలే సూపర్‌బజార్లు.. అంతే కాదు తమ వారికి కబురు పంపాలన్నా, కష్టసుఖాలు తెలుసుకోవాలన్నా సంతలే ఆధారం. కరోనాతో లాక్‌డౌన్‌ కారణంగా అన్నిచోట్లా వారపు సంతలు నిలిచిపోయాయి. గుమ్మలక్ష్మీపురం మండలం గొరడ సంతకు .దాదాపు 30 గ్రామాల నుంచి రెండువేల మందికి పైగా వస్తారు. సుమారు రూ.5 లక్షలు వ్యాపారం ఇక్కడ సాగుతుంది. చింతపండు సేకరణ కాలంలో అయితే, లక్షలాదిరూపాయలు ఇక్కడ చేతులు మారుతాయి. పక్కనే ఉన్న ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా వచ్చి సరకులు కొనుగోలు చేస్తుంటారు. కొమరాడ మండలం కూనేరులో ప్రతి శనివారం సంత నిర్వహిస్తారు. ఇక్కడ రూ.10 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. చింతపండు, కొండచీపుర్లు, పనసపండ్లు, ఉసిరికాయలు వంటి అటవీ ఉత్పత్తులకు ఇది ప్రధాన కేంద్రం. గిరిజనులు తమకు అవసరమైన నిత్యావసరాలను వ్యాపారుల నుంచి కొనుగోలు చేసుకొంటారు. ఒడిశాలోని సేసికెల, కెరడ, వనిజ తదితర ప్రాంతాల నుంచి గుమ్మలక్ష్మీపురం మండలంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ఈ సంత ప్రధాన వనరు. సమీప కూడళ్లలో సంతలు లేకపోవడంతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపక్క గిరిజనులు పండించే ఉత్పత్తులు విక్రయించుకునే పరిస్థితి లేదు. వీరికి కావాల్సిన సరకులు తెచ్చుకోలేకపోతున్నారు. కొందరు యువకులు పట్టణాలకు ఆటోలపై వెళ్లి సరకులు తీసుకువెళ్తున్నారు. సాధారణంగా సంతల్లో ధరకంటే రూ.5, రూ.10 ఎక్కువ వెచ్చిస్తే తప్ప వీరికి సరకులు దొరకని పరిస్థితి. నెలలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించే నిత్యావసర వస్తువుల కోసం జీసీసీ డిపోలకు వెళ్లేటప్పుడు కొన్ని సరకులను డిపోల్లో కొనుక్కుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గిరిజనుల వద్ద అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేసి వ్యాపారం చేసే వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. సంతలు జరగకపోవడంతో ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, పాచిపెంట, సాలూరు, మక్కువ మండలాల్లో వారానికి 27 కూడళ్లలో సంతలు జరుగుతాయి. వీటిలో పెద్ద సంతలుగా చెప్పుకోదగ్గవి కురుపాం, గుమ్మలక్ష్మీపురం, గొరడ, మొండెంఖల్లు, కూనేరు, దుగ్గేరు, బట్టివలస. ఒక్కో సంతలో రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. అటవీ ఉత్పత్తులు సేకరించి నాలుగు డబ్బులు చేతిలో ఆడే కాలంలో కొత్త దుస్తులు కొనుగోలు చేసుకోవడం, వాటిని కుట్టించుకోవడానికి సంతలే గిరిజనులకు ప్రధాన వనరుగా చెప్పుకోవాలి.

Related Posts