YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 నిధులొచ్చాయ్.. వెళ్లాయ్..

 నిధులొచ్చాయ్.. వెళ్లాయ్..

 నిధులొచ్చాయ్.. వెళ్లాయ్.. (ఆదిలాబాద్)
ఆదిలాబాద్, జూన్ 03 లాక్ డౌన్ ఫలితంగా జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన నిధుల్లో ఎక్కువ శాతం రద్దయ్యాయి. ప్రారంభం కాని పనులను రద్దు చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు రావడంతో తలలు పట్టుకోవడం ప్రజాప్రతినిధుల వంతైంది. ఏటా కేంద్ర ప్రభుత్వ పథకమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో రహదారుల నిర్మాణాలకు నిధులు మంజూరవుతుంటాయి. ఎప్పటిలాగే పోయిన ఆర్థిక సంవత్సరమైన 2019-20 సంవత్సరానికి జిల్లాకు నిధులు వచ్చాయి. జిల్లాకు సంబంధించిన ఎంపీ సోయం బాపురావుతో పాటు జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాఠోడ్‌ బాపురావులు సంబంధిత రాష్ట్ర మంత్రికి ప్రతిపాదించిన పనులు మంజూరయ్యాయి. వీరితోపాటు స్వల్పంగా నియోజకవర్గ ప్రాంతాలున్న ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేఖానాయక్‌లు సైతం జిల్లా పరిధిలోకి వచ్చే వారి మండలాల్లో పనులను మంజూరు చేయించుకున్నారు. మొదటి విడతలోనే కాకుండా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు రెండో విడతలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు కేటాయించింది. మొత్తానికి జిల్లాకు సంబంధించి పనులకు ఫిబ్రవరిలో ఆమోదం లభించింది. గ్రామ అవసరానికి అనుగుణంగా ఒక్కో రోడ్డుకు రూ. 2 లక్షలు, రూ.3 లక్షలు, రూ. 5 లక్షలు ఇలా వివిధ రకాల పనులు మంజూరయ్యాయి. ఈ పనులను గ్రామ పంచాయతీలకే అప్పగించారు. సర్పంచులు చెయ్యలేని పరిస్థితుల్లో వారే అనధికారికంగా ఇతర కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. పనులన్నీ మొన్నటి మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఫిబ్రవరి చివరలో మంజూరైన ఈ పనులకు సమయం తక్కువగా ఉండడంతో చాలాచోట్ల ఉరుకులు పరుగులు తీశారు. ఇక గత ఏడాదికి సంబంధించిన బిల్లులు ఈ ఏడాది రావడంతో బిల్లులు ఆలస్యమవుతాయనే కారణంతోనూ చాలాచోట్ల పనులు చేపట్టేందుకు వెనుకంజవేశారు. ఇలా తర్జనభర్జన పడుతున్న సమయంలో మార్చి 21న కేంద్రం జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వడం, ఆ తర్వాత మరుసటి రోజు నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో ఈ పనులపై తీవ్ర ప్రభావం పడింది. అప్పటివరకు రోజువారిగా ప్రగతి నివేదికలు కోరిన ఉన్నతాధికారులు కరోనా ప్రభావంతో నివేదికలు నిలిపివేశారు. ఇళ్లలోంచి ఎవరూ బయటకు రాని పరిస్థితి ఉండడంతో పనులన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మొత్తం మీద జిల్లాలో 20శాతం పనులు కూడా పూర్తికాకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో పనులు పూర్తైన వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇంకా అక్కడక్కడ మధ్యలో కొనసాగుతున్న పనుల వివరాలను నమోదు చేయాల్సి ఉంది. అసంపూర్తిగా ఉన్న పనులు కొన్ని వరకే ఉంటాయని అధికారుల అంచనా. ఎక్కువశాతం ప్రారంభం కాని పనులే ఉన్నాయి. వీటినే రద్దు చేస్తూ ఆదేశాలు జారీ కావడం అందరిలో నైరాశ్యం నెలకొంది దీనికి సంబంధించి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ నుంచి పంపించిన ఉత్తర్వులు జిల్లా అధికారులకు అందాయి. దీంతో పనులు పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు మండలాల వారిగా ప్రారంభం కాని పనుల వివరాలు తెప్పించుకున్నారు. మొత్తమ్మీద ప్రారంభం కాని పనులన్నీ రద్దు కావడంతో ఎంతో కష్టపడి పనులు మంజూరు చేయించుకున్న ప్రజాప్రతినిధుల్లో కొందరు మాత్రం అవి చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని సంబంధిత ఉన్నతాధికారులకు విన్నవించారు.

Related Posts