YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పరిహారం.. పరిహాసం

పరిహారం.. పరిహాసం

పరిహారం.. పరిహాసం (ఖమ్మం)
ఖమ్మం, జూన్ 03 ప్రకృతి విపత్తులతో కర్షకులు కుదేలవుతున్నారు. అకాల వర్షాలు, గోదావరి వరదలు రైతులను నష్టాలపాలు చేస్తున్నాయి. గత ఖరీఫ్‌ సీజన్‌లో భద్రాద్రి జిల్లాలో గోదావరి వరదలకు పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. వేల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. దీనికి సంబంధించిన పరిహారం కోసం అన్నదాతలు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఇంకోపక్క అధికారులు మాత్రం తాజా నిబంధనల ప్రకారం పరిహారం వచ్చే అవకాశం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, వరద తాకిడికి పెద్ద మొత్తంలో నష్టపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో వచ్చిన గోదావరి వరదల కారణంగా భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని పరీవాహక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని వందలాది ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయి. వరి, పత్తి, మిరప పంటలు జలమయం అయ్యాయి. మొక్కజొన్నకు సైతం నష్టం వాటిల్లింది. ఆ ఏడాది ఆరంభంలో అనావృష్టి.. ఆ తర్వాత అతివృష్టి, గోదావరి వరదలు రైతులను దెబ్బమీద దెబ్బ తీశాయి. పొడి దుక్కుల్లో రైతులు విత్తనాలు చల్లారు. ఎకరానికి రూ.5-6 వేలు ఖర్చు పెట్టారు. మొలకలు రాకపోవడంతో వాటిని చెడగొట్టి మరోసారి దుక్కులు దున్ని విత్తనాలు వేశారు. కొందరు రైతులు మూడుసార్లు విత్తనాలు వేశారు. పత్తి పూత, పిందె దశలో ఉన్న క్రమంలో వచ్చిన గోదావరి వరదలతో రైతులకు కన్నీరు మిగిలింది. వరి సైతం నాట్లు పూర్తి చేసి కలుపు తీసే దశలో వందలాది ఎకరాలు జలమయం అయ్యాయి. రెండు రోజుల పాటు వరద నిలకడగా ఉండడంతో పంటలు చాలావరకు దెబ్బతిన్నాయి. వరదలు తగ్గుముఖం పట్టిన అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించిన వ్యవసాయశాఖ అధికారులు ముంపునకు సంబంధించిన వివరాలు సేకరించారు. కొన్ని భూములలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయగా.. మరికొన్ని చోట్ల అదే పంటను సాగు చేశారు. నష్టాలతోనే ఆ రైతులకు ఖరీఫ్‌ పూర్తైంది. ప్రస్తుతం వానాకాలం సీజన్‌ ప్రారంభం కానుంది. కానీ ప్రభుత్వం నుంచి పరిహారం నేటికీ అందలేదు. పంట నష్టం 33 శాతం కంటే తక్కువగా ఉంటే పరిహారం వచ్చే అవకాశం లేదని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. పంట కోసే దశలో ఉంటేనే పరిహారం అందుతుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ పెద్దలు స్పందించి న్యాయమైన నష్ట పరిహారం అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.

Related Posts