ఆశలు రేపిన గోదారి (మెదక్)
మెదక్, జూన్ 04 జలసవ్వడి లేక మూగబోయిన హల్దీ గోదావరి నీటితో పరవశించనుంది. కొండపోచమ్మ నుంచి వడివడిగా జలాలు ఈ వాగును చేరేలా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జూన్ 15 నాటికి హవేలి ఘనపూర్‌లోని ర్యాలమడుగు చెక్‌డ్యాం వరకు నీళ్లు వచ్చేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ జలాశయం నుంచి నీటి విడుదలకు రంగం సిద్ధమైంది. అక్కడి నుంచి కాలువల ద్వారా సంగారెడ్డి వరకు గోదావరి జలాలను తెచ్చేలా పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆరు కిలోమీటర్ల మేర కాలువ పనులు సాగుతున్నాయి. ఈ ఆరు కిలోమీటర్ల పాయింట్ వర్గల్ మండలంలోని గౌరారం వద్ద ఉంది. ఇక్కడ గోదావరి నీళ్లను బంధం చెరువులో నింపి అక్కడి నుంచి పెద్దచెరువు, దమ్మక్కచెరువుల మీదుగా ఖాన్‌చెరువును నింపేలా ప్రణాళిక రూపొందించారు. అనంతరం నేరుగా హల్దీవాగులోకి గోదారమ్మ ప్రవేశిస్తుంది. వర్గల్ మీదుగా తూప్రాన్ నుంచి మెదక్‌లోని ర్యాలమడుగు వరకు ప్రవహించే హల్దీవాగు అక్కడ మంజీరాలో కలుస్తుంది. దాదాపు 15 కిలోమీటర్ల మేర మంజీరా నదిలో ప్రవహించి కామారెడ్డి జిల్లాలోకి చేరుతుంది. హల్దీవాగులోకి వచ్చే జలాలు మంజీరాలోనూ ప్రవహిస్తాయి. వాగుపై ఇప్పటికే అయిదు చోట్ల చెక్‌డ్యాంలు నిర్మించారు. మరొకటి పురోగతిలో ఉంది. వెల్దుర్తి మండలం హకీంపేట వద్ద హల్దీ ప్రాజెక్టునూ గతంలోనే నిర్మించగా 2,900 ఎకరాల ఆయకట్టు ఉండగా కాలువలు బాగా లేకపోవడంతో 400 ఎకరాలకు మించి సాగవడం లేదు. ఇప్పుడు నీళ్లే లేకపోవడంతో పంటలే వేయలేదు. కొత్తవాటితో పాటు పాత చెక్‌డ్యాంలు అన్నీ కలిపితే మొత్తం ఈ వాగుపై 18 చెక్‌డ్యాంలు ఉన్నాయని మెదక్ జిల్లా నీటిపారుదల శాఖ అధికారి ఏసయ్య వివరించారు. వీటన్నింటిలో అర టీఎంసీ మేర నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. రెండు జిల్లాల్లో కలిపి హల్దీవాగు దాదాపు 50 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. ఈ వాగులోకి గోదావరి జలాలు రావడంతో వాగుకు చుట్టుపక్కల ఉన్న పొలాల బోర్లలో నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. ఆయకట్టుకు నీరందడంతో పాటు ఆరుతడి పంటల సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. జీవజాతులకూ నీటి కొరత లేకుండా చూడొచ్ఛు కొన్నేళ్లుగా నీరులేక జీవకళ కోల్పోయిన హల్దీవాగు జలకళను సంతరించుకుంటే ఈ మండలాల పరిధిలో పచ్చదనం మళ్లీ పురుడు పోసుకుంటుంది.zz