*ఆశీర్వచనం*
అంతా శుభం జరగాలని దీవించడమే ఆశీర్వచనం. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, అభీష్టాలు సిద్ధించాలని పెద్దలు ఆశీస్సులు ఇస్తారు. నిండుమనసుతో, తృప్తి నిండిన హృదయంతో ఇచ్చే నిష్కల్మష ఆశీర్వచనంలో బలం ఉంటుంది. శుద్ధత్వం ఉండే వాచక శక్తి కాబట్టి అమృతంతో సమానమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆశీస్సులు నైతిక బలాన్నిస్తాయి. జీవితంలో అవి చోదకశక్తిగా ఉంటాయి. ఉన్నతిని కోరేవిగా ఉంటూ హితవు పలుకుతాయి. మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. గృహస్థు చేసిన మర్యాదలతో సంతుష్టాంతరంగులైన అతిథి అభ్యాగతులు ఇచ్చే దీవెనలు స్వచ్ఛంగా ఉంటాయి. తృప్తి నిండిన మనసు పలికే ఆశీస్సులు, యోగిపుంగవుల దీవెనలతో సమానం! పైకి ప్రేమ, అభిమానం కనబరుస్తూ లోలోపల అసూయాద్వేషాలతో కుమిలిపోతుంటారు కొందరు. నియమనిష్ఠలు కలిగి, సత్వ గుణ సంపన్నులుగా ఉండేవారి వాక్కులు ఫలిస్తాయన్న నమ్మకం, విశ్వాసం మనది. దీన్నే గీతాచార్యుడు వాచక తపస్సుగా చెప్పాడు. వెన్నెలలో చల్లదనంలా, ఉరుకులు పరుగుల ఈ జీవితాల్లో ఆనందాన్ని, ప్రశాంతచిత్తాన్ని ప్రసాదిస్తాయి ఈ దీవెనలు. పోటీలు పడుతూ ఆశీర్వచనాలు అందుకున్నంత మాత్రాన అద్భుతాలేవో జరగవు. మనం నమ్ముకోవాల్సింది, విశ్వసించవలసింది త్రికరణ శుద్ధిగా ఆచరించే క్రియలను మాత్రమే. మనం చేసే సాధనలకు, ప్రయత్నాలకు ప్రోత్సాహం కూడా అవసరం. పంట ఎంత బాగా పండినా రైతు ధాన్యాన్ని కళ్లంలో శుభ్రం చెయ్యనిదే బండ్లకెత్తడు. బలవంతుడికైనా చోదకశక్తి అవసరం. అవతార పురుషుడికైనా అమ్మలాలన, పాలన అవసరం. సిరిసంపదలెన్ని ఉన్నా సుఖశాంతులు ఆవశ్యకం. జీవితానికి సరిపడా అన్నీ ఉన్నాయన్న భరోసా, ధైర్యం మాత్రమే సరిపోవు. జీవన దశల్లో, చేపట్టే కార్యాల్లో శుభం జరగాలని కోరేవారు ఉండాలి. దీవించేవారు ఉండాలి. వివాహాది శుభకార్యాలు ఎంతో ఘనంగా, ఆడంబరంగా నిర్వహిస్తుంటారు. ఆ వేడుకల్లో పెద్దలిచ్చే ఆశీస్సులదే ప్రముఖ పాత్ర. వారి ఆశీస్సులే వధూవరుల దాంపత్య జీవనానికి శ్రీరామరక్షగా భావిస్తారు. భగవానుడి కోవెలలో పొందే వేదాశీర్వచనాలను కొందరు సాక్షాత్తు దేవదేవుడిచ్చే ఆశీస్సులుగా భావిస్తారు. భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన ఆశీర్వచన సంప్రదాయం విశిష్టమైనది!
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో