సోషల్ మీడియాలో మితీమీరుతున్న కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర ప్రముఖంగా మారింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం దారుణ ఓటమికి దారి తీసిన కారణాల్లో సోషల్ మీడియా కూడా ప్రధానమైనది. అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకొని టీడీపీ వైఫల్యాలను, తప్పులను ఎండగట్టారు. ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎన్నికలకు చాలా రోజుల ముందే టీడీపీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడంలో సోషల్ మీడియాదే కీలక పాత్ర. అయితే, అప్పుడు తమకు బాగా ఉపయోగపడిన సోషల్ మీడియా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బాగా ఇబ్బంది పెడుతోంది.సోషల్ మీడియా ప్రాధాన్యతను గుర్తించిన అన్ని పార్టీలూ ప్రత్యేక దృష్టి పెట్టాయి. వైసీపీ, టీడీపీ, జనసేనకు ప్రత్యేకంగా ఐటీ సెల్స్ ఉన్నాయి. వైసీపీ, టీడీపీకి మండలాల వారీగా సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ఉన్నారు. ఇలా అధికారికంగా సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా ఉన్న వారే కాకుండా మూడు పార్టీలకూ వేలాదిగా అభిమానులు ప్రతి రోజూ సోషల్ మీడియాలో ఉంటారు.వీరంతా తమ పార్టీ కార్యక్రమాలు, సిద్ధాంతాలు ప్రచారం చేసుకోవడం కంటే ఎక్కువ అవతలి పార్టీ వాళ్లను తిట్టడం, అవతలి పార్టీ నేతను దూషించడమే పనిగా పెట్టుకుంటున్నారు. మార్ఫింగ్ ఫోటోలు చేసి సోషల్ మీడియాలో పెట్టడం, ఇంట్లో ఆడవారిని సైతం వదలకుండా బండ బూతులతో విరుచుకుపడుతుండటం సహజంగా మారిపోయింది.మూడు పార్టీల వారు ఒకరిని ఒకరు తిట్టుకోవడం, ఆ గొడవలు బయటి వరకు వెళ్లి కొట్టుకోవడం కూడా జరుగుతున్నాయి. వీరి సోషల్ మీడియా పోస్టులు, కామెంట్లు చూస్తుంటే ఇతరులకు రాజకీయాలు, సోషల్ మీడియా అంటేనే విసుగెత్తుతోంది. అయితే, ఇలా సోషల్ మీడియాలో తమ పార్టీల తరపున కొట్లాడే వారికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాయి అన్ని పార్టీలూ. బయటకు తమకు సంబంధం లేదని చెబుతున్నా అన్ని పార్టీలూ దీనిని ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవల వరుసగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో హైకోర్టును, జడ్జిలను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టారు. అధికారంలో ఉన్న తమకు ఏమవుతుందిలే అని అనుకొని విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు.కానీ, హైకోర్టు సీరియస్ అయ్యి కొందరికి నోటీసులు ఇచ్చింది. వీరి విషయంలో వైసీపీ అనూహ్యంగా స్పందించింది. హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న వారికి తమ పార్టీ మద్దతు ఉంటుందని స్వయంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ తరపున సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే వారిపై పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలోనూ విజయసాయిరెడ్డి వారికి మద్దతు ఇచ్చారు. వారిని అరెస్టు చేయాలంటే ముందు నన్ను అరెస్టు చేయండి అని కూడా పోలీసులతో ఆయన వాదనకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. ఈ రెండు ఉదాహరణలు చాలు వైసీపీ తమ సోషల్ మీడియా శ్రేణులు ఏం చేసినా అండగా ఉంటుందని చెప్పడానికి.ఇదే సమయంలో టీడీపీ కూడా ఇదే వైఖరితో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా వారిపై చాలా కేసులు పెట్టించింది టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్‌గా మారారు ఆ పార్టీ శ్రేణులు. వైసీపీని లక్ష్యంగా చేసుకొని పోస్టులు పెడుతున్నారు. ఇందులో కొన్ని తప్పుడు ప్రచారాలూ ఉంటున్నాయి.ముఖ్యమంత్రి హోదాను కూడా గౌరవించకుండా అసభ్యంగా పోస్టులు పెడుతున్న వారూ ఉన్నారు. దీంతో ప్రభుత్వం వీరిపైన కేసులు పెడుతోంది. ఈ కేసులను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంటే, తమ పార్టీ వారు ఏం పోస్ట్ చేసినా మా మద్దతు ఉంటుందని, కేసులు మాత్రం పెట్టవద్దని చెబుతున్నట్లుగా ఈ వ్యవహారం ఉంది.కొత్త తరహా రాజకీయం చేసే జనసేన పార్టీ సోషల్ మీడియాకు సంబంధించి మాత్రం మిగతా పార్టీల బాటలోనే నడుస్తోంది. మిగతా రెండు పార్టీలకు బలమైన మీడియా ఉంది. జనసేనకు ఒకటి, రెండు అనుకూల ఛానళ్లు తప్ప మీడియా బలం లేదు. కానీ, సోషల్ మీడియాలో శతఘ్ని పేరుతో ప్రత్యేక బలగం ఉంది. కానీ, కొందరు పవన్ అభిమానులు, జనసేన శ్రేణులు మాత్రం సోషల్ మీడియాలో అదుపు తప్పుతున్నారు. అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఇలా మూడు పార్టీలూ కలిసి సోషల్ మీడియాను కంపు కంపు చేసేశాయి. కనీసం ఈ చెడు సంస్కృతిని నివారించే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు ఆయా పార్టీలు. పైగా, తమ వారికి అన్ని విధాలుగా మద్దతుగా ఉంటున్నారు. ఏ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అయినా అరెస్టు అయితే ఆ పార్టీనే అడ్వకేట్‌ను పెట్టి బయటకు తీసుకొస్తోందనే ప్రచారమూ ఉంది. దీంతో సోషల్ కార్యకర్తలు విజృంభిస్తున్నారు. దీనికి ఒక పుల్‌స్టాప్ పెట్టాలంటే పార్టీల అధినేతలు స్పందించాల్సిందే.