జూలై తర్వాతే సినిమాహాల్స్
న్యూఢిల్లీ, జూన్ 4
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో సినిమా హాళ్లు సుమారు 70 రోజులుగా మూతబడ్డాయి. లాక్‌డౌన్‌కు క్రమంగా సడలింపులు ఇస్తూ అన్‌లాక్ 1.0 ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వివిధ పరిశ్రమలు, షాపులు తెరుచుకోవడానికి, ప్రయాణాలకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లు ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయా అని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటివారు మరో నెల ఆగాల్సిందేనని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంకేతాలిచ్చారు. దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లను తెరిచే అంశాన్ని జూన్ తర్వాతే పరిశీలిస్తామని ఆయన చెప్పారు.జూన్ నెలకు సంబంధించి కరోనా కేసుల సంఖ్య, వైరస్ వ్యాప్తి పరిస్థితిని పరిశీలించిన అనంతరం మాత్రమే సినిమా హాళ్లను తెరిచే అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి జవదేకర్ తెలిపారు. కొవిడ్-19, లాక్‌డౌన్ ప్రభావంతో సినీ రంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తదితర సంఘాలు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించాయి. సినిమా హాళ్లను తెరవాలన్న విజ్ఞప్తిపై ఆయన స్పందించారు.దేశంలోని 9,500 సినిమా హాళ్లలో కేవలం టికెట్ల అమ్మకం ద్వారానే రోజుకు రూ.30 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని మంత్రి జవదేకర్ తెలిపారు. లాక్‌డౌన్‌తో భారీగా సష్టపోయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయంపై సినీ రంగం సంఘీభావంగా ఉండటాన్ని ఆయన ప్రశంసించారు.వేతనాల్లో సబ్సిడీలు, రుణాలపై మూడేళ్ల పాటు వడ్డీ మాఫీ, ట్యాక్స్‌లు, సుంకాల మినహాయింపు, విద్యుత్ బిల్లుల కనీస డిమాండు ఛార్జీల మాఫీ తదితర డిమాండ్లను సినీ సంఘాల ప్రతినిధులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఆ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వంపై అధిక భారం పడుతుందని మంత్రి వివరించారు. వారి డిమాండ్లను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.సినిమా నిర్మాణ పనుల పున: ప్రారంభించటంపై అడిగిన ప్రశ్నకు మంత్రి జవదేకర్ బదులిస్తూ.. మరి కొన్ని రోజులు ఆగాల్సిందేని తెలిపారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిందని గుర్తు చేశారు. కరోనా అన్‌లాక్-1కు సంబంధించి హోం శాఖ ఇటీవల ప్రకటించిన మార్గదర్శకాల్లో.. ప్రార్థనా స్థలాలు, దేవాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తదితరాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. జూన్ 8 నుంచి షాపింగ్ మాల్స్ తెరుచుకోవచ్చునని స్పష్టం చేశారు. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, బార్లు, పబ్బులు లాంటివి తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు మూసే ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.