చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మరో క్షురకుడు ఆత్మహత్య
చిత్తూరు జూన్ 4,
శ్రీకాళహస్తిలో మరో క్షురకుడు అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అతను చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించాడు. దీంతో అతని స్వగ్రామం శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో విషాదం అలుముకుంది. వివరాలిలావున్నాయి.. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామానికి చెందిన మురళీ(60) క్షురకుడు. కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అలాగే గ్రామంలోనే గాక పరిసర గ్రామాల్లోనూ క్షురకునిగా కులవృత్తిని కొనసాగిస్తున్నాడు. కుటుంబపోషణకు, పంట సాగుకు పెట్టుబడుల కోసం అప్పులు చేశాడు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయాడు. చేయడానికి పనులు లేకపోవడంతోపాటు వ్యవసాయంలోనూ ఇటీవల నష్టాలను చవిచూశాడు. ఈ పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారస్తుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో మూడు రోజుల క్రితం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబీకులు అతన్ని చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు గ్రామానికి చేరుకుని విచారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపారు. ఇదిలా ఉంటే ఇటీవల శ్రీకాళహస్తి పట్టణం ప్రాజెక్టువీధికి చెందిన ఓ క్షురకుడు అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన మరువకముందే మరో క్షురకుడు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ రెండు సంఘటనలను బట్టి వడ్డీ వ్యాపారస్తుల ఒత్తిళ్లు ఏలా ఉన్నాయో చెప్పకనే తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వడ్డీ వ్యాపారస్తుల ఒత్తిళ్ల నుంచి రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.