కియా ఫ్యాక్టరీలో కరోనా కలకలం
అనంతపురం, జూన్ 5
కియా మోటార్స్‌లో కరోనా కలకలంరేగింది. ఫ్యాక్టరీ బాడీ షాప్‌లో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బాధితుడు తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.. అతడు గత నెల 25న ఫ్యాక్టరీకి వచ్చినట్లు గుర్తించారు. అతడ్ని అనంతపురం ఎస్కేయూ క్వారంటైన్‌కు తరలించారు. అతడితో కాంటాక్ట్‌లో ఉన్న ఉద్యోగుల్ని గుర్తించే పనిలో ఉన్నారు.. అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పరిశ్రమలో ప్రతి ఒక్కరికి కోవిడ్ పరీక్షలు నిర్వహించిన అనంతరమే విధుల్లోకి తీసుకోవాలని కియా పరిశ్రమ యాజమాన్యం సూచించింది.కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌తో కియా ఫ్యాక్టరీ మార్చిలో మూతపడింది. గత నెలలో మళ్లీ పరిశ్రమను ఓపెన్ చేశారు.. ఉద్యోగులు, ఇతర సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. అలాగే యాజమాన్యం మాస్కులు, శానిటైజర్ వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వరకు అంతా సజావుగానే సాగింది.. ఇప్పుడు ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ తేలడంతో ఉద్యోగుల్లో కూడా అలజడి రేగింది.