బాలీవుడ్ డైరక్టర్ కన్నుమూత
ముంబై, జూన్ 5
బాలీవుడ్ దర్శకుడు బసు చటర్జీ కన్నుమూశారు. 93 ఏళ్ల బసు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూన్ 3న ఆయన మరణించారు. 1930 జనవరి 10న బసు అజ్మీర్‌లో జన్మించారు. సామాజిక అంశాలను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలోనూ బసు చటర్జీకి సిద్ధహస్తుడిగా పేరుంది. చోటీసీ బాత్, రజనీగంధ, బాతో బాతో మే, ఏక్ రుకాహువా పైసలా, చమేలీకి షాది తదితర సినిమాలకు బసు దర్శకత్వం వహించారు. హిందీతో పాటు బెంగాలీలో కూడా ఆయన అనేక సినిమాలు తీశారు. 70 వ దశకంలో సూపర్ స్టార్లతో కలిసి సినిమాలు చేశారు. బసు మరణంపై దర్శకుడు అశ్విని చౌదరి, మధుర్ భండార్కర్, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు.బసు సినిమాలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయని అంటారు. అమితాబ్ బచ్చన్‌తో మంజిల్, రాజేశ్ ఖన్నాతో చక్రవ్యూహ్, దేవానంద్‌తో తీసిన మన్ పసంద్ సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. అనేక టీవీ సీరియళ్లకు కథ, మాటలు సమకూర్చారు. సినీ రంగంలోనే కాకుండా టెలివిజన్ రంగంలోనూ బసు చటర్జీ తనదైన ముద్ర వేసుకున్నారు. దూరదర్శన్‌లో ఒకప్పుడు సూపర్ హిట్ అయిన బ్యోంకేశ్ బక్షి, రజని బసు చటర్జీ డైరెక్ట్ చేసినవే. దూరదర్శన్‌లో ఈ రెండు సిరీస్‌లు అప్పట్లో ఓ పెను సంచలనం సృష్టించింది. 1992లో బసు జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటని పలువురు వ్యాఖ్యానించారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పించారు