ఏపీకి చెందిన టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌరవిమానాయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చిక్కుల్లో పడనున్నారా?. అంటే అవునంటున్నాయి అధికార వర్గాలు. పౌరవిమానయాన శాఖ పరిధిలో ఉన్న ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ను ఘోరంగా అవమానించేలా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది. ఇది ఖచ్చితంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు అవమానమే అని, ఆయన శాఖ పరిధిలోని సంస్థ విమానాశ్రయాల నిర్వహణలో సరిగాలేదనే కారణంతో ఏపీ కేబినెట్ ఏఏఐ దక్కించుకున్న టెండర్ ను రద్దు చేసింది. ఎలాంటి సహేతుకమైన కారణం లేకుండా..కేవలం తమ అస్మదీయ కంపెనీలకు ప్రాజెక్టు కట్టబెట్టేందుకు వీలుగా టెండర్ రద్దు చేస్తే విమానయాన శాఖను పర్యవేక్షిస్తున్న అశోక్ గజపతిరాజు మౌనంగా చూస్తూ ఉంటారా?. లేక ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై ఏఏఐ తరపున కోర్టులో పిటీషన్ దాఖలు చేయించుతారా? అన్నది ఆసక్తికరంగా ఉంది.ఈ పరిణామంపై ప్రధాని నరేంద్రమోడీ ఎలా స్పందిస్తారో అని అధికార వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నట్లు ఏఏఐకి విమానాశ్రయాల నిర్వహణలో అంత అనుభవం లేదా? అంటే ఈ సంస్థ దేశంలో 125 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. అందులో 18 అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా. చెన్నయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఏఏఐ పరిధిలోనే ఉంటుంది. ప్రైవేట్ విమానాశ్రయాలకు ధీటుగా ఇక్కడ సౌకర్యాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇన్ని విశిష్టతలు ఉన్న ఏఏఐని ఏపీ ప్రభుత్వం తీసి పక్కన పడేయటం అంటే..ఇది ఖచ్చితంగా ఆ శాఖను నిర్వహిస్తున్న సొంత మంత్రి అశోక్ గజపతిరాజును అవమానించటమే అంటున్నారు అధికారులు.