పడకేసిన పరిశ్రమ (కర్నూలు)
కర్నూలు, జూన్ 05 జిల్లాకు తలమానికంగా నిలుస్తున్న ఓర్వకల్లులోని పలు పరిశ్రమలు లాక్‌డౌన్‌తో పడకేశాయి. వివిధ పరిశ్రమల ఏర్పాటుతో ఓర్వకల్లు దశ, దిశ మారనున్న సందర్భంలో కరోనా దెబ్బకొట్టింది. గుట్టపాడు, ఎన్.కొంతలపాడు గ్రామాల పరిధిలో జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ, పాలకొలను సమీపంలోని డీఆర్‌డీవోలో వలస కూలీలతో నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్న తరుణంలో లాక్‌డౌన్‌తో అవి ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పరిశ్రమ యాజమాన్యం, అధికారులు కూలీలను తమ ప్రాంతాలకు పంపేందుకు చర్యలు తీసుకున్నారు. పరిశ్రమల్లోని కొన్ని పనుల్లో ఇతర రాష్ట్రాల కూలీలు నైపుణ్యం గలవారు కావడంతో ఆ కూలీలు తిరిగొచ్చేంతవరకూ పనులు ముందుకు కదలనట్లే కనిపిస్తున్నాయి. ఓర్వకల్లు సమీపంలో ఏర్పాటు చేస్తున్న విమానాశ్రయం పనులు ముందుకు సాగడంలేదు. గత ప్రభుత్వం వెయ్యి ఎకరాల్లో రూ.100 కోట్లతో పనులు ప్రారంభించి ముగింపు దశకు వచ్చినా లాక్‌డౌన్‌తో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. విమానాశ్రయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ఏడాది మే నాటికి పనులు పూర్తి చేసి విమానాల రాకపోకలను కొనసాగించాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. పాలకొలను సమీపంలో 2,780 ఎకరాల్లో డీఆర్‌డీవో పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఏడాది నుంచి రూ.550 కోట్లతో ముఖద్వారం, భవనాలు, ప్రహరీ తదితర పనులు సాగుతున్నాయి. ఈ పనులు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, బిహార్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన 210 మంది వలస కూలీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 80 మంది వలస కూలీలను తమ ప్రాంతాలకు పంపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని కూడా సొంత రాష్ట్రాలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఓర్వకల్లు మండలం కాల్వ సమీపంలో 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పుట్ట గొడుగుల పరిశ్రమలో మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 50 మంది వలస కూలీలు పని చేస్తున్నారు. ప్రస్తుతం పనులు నిలిచిపోయినప్పటికీ వలస కూలీలు తమ ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా లేకపోవటంతో వారికి అధికారులు అన్నిరకాల వసతులు కల్పిస్తున్నారు.