YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 పగబట్టిన పొగాకు

 పగబట్టిన పొగాకు

 పగబట్టిన పొగాకు (నెల్లూరు)
నెల్లూరు, జూన్ 05 : పొగాకు పగాకుగా మారింది.. రైతును గుండెకోతకు గురిచేస్తోంది.. మొన్నటి వరకు అమ్మకానికి అవకాశం లేక, ఆదాయం తెచ్చుకునే మార్గం కరవై రైతుకు అధ్వాన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో వేలం ప్రక్రియ ప్రారంభమైనా మద్దతు ధర దక్కకపోవడం మరింత కుంగదీస్తోంది. నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంత రైతాంగానికి నిర్వేదమే మిగిలింది. మార్కెట్‌లో మధ్యస్తం పొగాకు ధరలు బాగా తగ్గుముఖం పట్టగా, లోగ్రేడ్‌ కొనే నాథుడే లేరు. కరోనా కారణంగా ఇతర దేశాలకు పొగాకు ఎగుమతులు ఖరారు కాలేదని ఎగుమతిదారులు అంటుండగా, మాకు మార్కెట్లో పోటీ లేదు.. మా ధర అంతేనని ప్రధాన కొనుగోలుదారు వ్యవహారం మార్కెట్లో ధరల పతనానికి కారణమైంది. ఇతర వ్యాపార సంస్థలు వేలంలో నామమాత్రంగా పొల్గొంటుండగా, ప్రస్తుతానికి ఎక్కువ భాగం పొగాకును ఐటీసీ సంస్థ మాత్రమే కొనుగోలు చేస్తోంది. బయటి దేశాల ప్రతినిధులు భారత్‌లోకి వచ్చి పొగాకును పరిశీలించి ఎగుమతులు ఖరారుచేసే అవకాశం లేకపోవడం కూడా ధరల పతనానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జిల్లాలోని డి.సి.పల్లి వేలం కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టి బేళ్లను తగులపెట్టిన పరిస్థితి సమస్యకు అద్దం పడుతోంది. మార్కెట్లో ధర ఉన్నా.. లేకున్నా ఇతర పంటలు ఉత్పత్తి చేసే రైతుల పరిస్థితి వేరుగా ఉంటుంది. పండించిన పంటనంతా ఏకకాలంలో అమ్మి సొమ్ము చేసుకోవచ్ఛు అందుకు పొగాకు పంట భిన్నం. క్లస్టర్ల వారీగా కనీసం ఐదు నెలల పాటు కొనుగోళ్లు జరుగుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26న జిల్లాలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించారు. కరోనా నియంత్రణలో భాగంగా మార్చి 21 నుంచి అమ్మకాలు నిలిపేశారు. లాక్‌డౌన్‌ సడలింపులతో కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ, వేలం కేంద్రాల్లో సిబ్బందికి కొవిడ్‌-19 వైద్య పరీక్షలు ఆలస్యం కావడంతో గత నెల 11న జిల్లాలో కొనుగోళ్లు పునఃప్రారంభం అయ్యాయి. ఈ ప్రక్రియలో జాప్యం కారణంగా పెట్టుబడులకు వడ్డీలు పెరిగాయని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 10.84 మిలియన్‌ కిలోల అమ్మకాలకు బోర్డు అనుమతివ్వగా ఇప్పటికి 2 మి.కె. మాత్రమే అమ్మకాలు జరిగాయి. అనధికారిక ఉత్పత్తితో కలిపి ఇంకా 9 మి.కే పైగా పొగాకు రైతుల ఇళ్లలో నిల్వ ఉంది. ఈ ఏడాది ప్రకృతి ప్రభావం, అనుకూలించని వాతావరణంతో సాగు ఖర్చు పెరిగింది. కొన్నిచోట్ల ఆకురెలిచే దశకు చేరిన తోటలు అధిక వర్షాలకు డిసెంబర్‌, జనవరి నెలల్లో పాడయ్యాయి. పాడైన తోటలను తొలగించి తిరిగి అదేపొలాల్లో మొక్కలు నాటి తోటలను పెంచారు. కూలీల ఖర్చు గణనీయంగా పెరగడం, ఇతరత్రా కారణాలతో పెట్టుబడి ఖర్చు బాగా పెరిగింది. ఈ ఏడాది అనుకూలించిన వాతావరణం కారణంగా పొగాకుతోటల సమయంలోనే ఆకులపై జిగురు పోవడం, ఇతరత్రా కారణాలతో ఆకు బరువు కోల్పోయింది. ఫలితంగా గతంలో ఒక కట్ట బరువు 600 గ్రాములు నుంచి 700 వరకు ఉండగా, ఈ ఏడాది 300 నుంచి 450 గ్రాములకు పడిపోయింది. గతంలో కిలోకు 200 ఆకులు తూగుతుంటే, ఈ ఏడాది 250 ఆకులు తూగే పరిస్థితి. వేసవి ఉష్ణోగ్రతల కారణంగా మేలిమిరకం నాణ్యత, తూకం తగ్గడం ఏటా సాధారణమే. అయితే లాక్‌డౌన్‌తో కొనుగోలు ప్రక్రియ రెండు నెలలు ఆగడంతో నాణ్యత మరింత దెబ్బతిని తూకంలోనూ బాగా వ్యత్యాసం వచ్చింది. కాడల్లో పుచ్చులు వచ్చాయి. 150 కిలోల బేలుకు సరాసరిన ఏడు కిలోల తరుగు వస్తోంది. ప్రస్తుత మార్కెట్‌తో పోలిస్తే రైతు అన్నివిధాలా బేలుకు సుమారు రూ.7వేల వరకు నష్టపోతున్నాడు. అమ్మకాలు పూర్తయ్యేకి కిలో పొగాకు సరాసరి ధర రూ.160 ఉంటే నష్టపోమని రైతాంగం చెబుతోంది. కాని ఎక్కడో ఒక బేలును మాత్రమే కిలో ధర రూ.170తో కొనుగోలు చేస్తున్నారని, మేలిమి రకం కిలో సరాసరి ధర రూ.145కి పరిమితమైందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యస్తం, లోగ్రేడ్‌ రకాల కొనుగోళ్లు పూర్తయ్యేలోపు కిలో సరాసరి ధర రూ.120కి పడిపోయేలా ఉందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ పరిస్థితి ఏంటని రైతాంగం గగ్గోలు పెడుతోంది.

Related Posts