ఖరీఫ్ కు సిద్ధమౌతున్న రైతులు
ఏలూరు, జూన్ 6,
తొలకరి పలకరించిన వేళ రైతుల్లో కొత్త ఉత్సాహం పులకరించింది. ఖరీఫ్ సేద్యానికి సిద్ధమవుతున్నారు. నిరుడు వర్షాభావం, అకాల వర్షాలు, నాసిరకం, కల్తీ విత్తనాలు, పంటలకు ధరల్లేమి ఇత్యాది సమస్యలన్నీ కట్టకట్టుకొని రైతులను చుట్టుముట్టి నష్టాలు మూటగట్టించాయి. ఈ మారైనా 'కాలం' కలిసి వస్తుందేమోనని రైతులు ఆశ పడుతున్నారు. రైతులు సాగు చేపట్టాలంటే విత్తనాలు, ఎరువులు, పెట్టుబడులు వంటి ముఖ్యమైన ఉత్పాదకాలు అందుబాటులో ఉండాలి. అందుకు ప్రభుత్వం బాధ్యతగా పూచీ పడాలి. సర్కారులో అలాంటి సన్నద్ధత కానరావట్లేదు.మే నెలాఖరలో కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు కొన్నిగంటల ముందు రాయలసీమలో ప్రవేశించాయి. ఈ ఏడాది దగ్గరదగ్గర సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ మోసుకొచ్చిన చల్లని కబురు అన్నదాతల్లో ఆశలు చిగురింపజేసింది. గడచిన నాలుగు సీజన్లలో ఎదురైన అనుభవాలే అందుకు సజీవ సాక్ష్యాలు. ఆర్భాటంగా సాగు లక్ష్యాలు నిర్ణయించడం మినహా ప్రభుత్వపరంగా ఏమేమి చేయాలో అవి చేయట్లేదు. మబ్బును చూసి ముంతలోని నీటిని ఒలకబోయడం కరువొచ్చాక తీరిగ్గా బావి తవ్వడం మొదలుబెట్టడం ఇదీ సర్కారు పద్ధతి. సీజను ముంచుకొస్తున్నా ఇప్పటి వరకు వ్యవసాయ ప్రణాళిక సిద్ధం కాలేదు. ఇదివరికటి మాదిరిగా రెండేళ్ల నుంచి కార్యాచరణ ప్రణాళికను అధికారికంగా విడుదల చేయట్లేదు. ముఖ్యమంత్రి సమీక్షలు, ఉన్నతాధికారుల ఫైళ్లల్లో అంకెలు నిక్షిప్తమవుతున్నాయంతే. ఇరవై లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేస్తున్నామని వాటిలో రాయితీపై తొమ్మిది లక్షల క్వింటాళ్లు రైతులకు పంపిణీ చేస్తున్నామంటున్నారు.ఈ తడవ ఖరీఫ్‌లో 42 లక్షల హెక్టార్లలో పంటలను సాగు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. నిరుడు కూడా ఇదే రకమైన అంచనాలు వేయగా 36 లక్షల హెక్టార్లకి సాగు పరిమితమైంది. గతానుభవం బట్టి ఈ ఏడు లక్ష్యాలను బావుకుంటుందన్న విశ్వాసం కలగడంలేదు. ఎంతగా గణాంకాలతో కరువును మూసి పెట్టాలనుకున్నా వాస్తవ సాగు లెక్కలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. అయినాసరే వ్యవసాయ వృద్ధి రేటు ఏకబిగిన 12.30 శాతానికి ఎగబాకిందని ప్రభుత్వం గొప్పలకు పోవడం వంచనే. విత్తన పంపిణీలో మాటలు ప్రతి ఏడాదీ కోటలు దాటుతున్నాయి. చేతలే గడపలు దాటట్లేదు. నాలుగేళ్లుగా సబ్సిడీ విత్తనాల ఇండెంట్లకు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. సరాసరిన 70 శాతం సైతం పంపిణీ చేయట్లేదు. యాభై శాతం సబ్సిడీ అంటున్నా అంత ఇవ్వట్లేదు. ఇస్తామన్న విత్తనాలూ పంపిణీ చేయట్లేదు. రాయలసీమలో ప్రధాన పంట వేరుశనగ. తొలకరి వానలకు జూన్, జూలైలో విత్తుతారు. ఇప్పటి వరకు సర్కారు పూర్తి స్థాయిలో వేరుశనగ సబ్సిడీ విత్తనాలను సిద్ధం చేయలేదు. అరకొరగా ఇచ్చిన చోట మార్కెట్‌లో కంటే రాయితీపై ఇచ్చే విత్తనాల ధర ఎక్కువ. నాసిరకం, కల్తీ విత్తనాలు మార్కెట్లను ముంచెత్తుతున్నా సరైన తనిఖీలూ లేవు. నియంత్రణా లేదు. నిరుడు అమరావతి కేంద్రంగా అనుమతుల్లేని బిటి-3 పత్తి విత్తనాలు రాష్ట్రం మొత్తానికీ యధేచ్ఛగా ప్రైవేటు సంస్థలు తరలించినా నిర్దిష్ట చర్యల్లేవు. కల్తీ మిరపనారు వలన రాజధానికి కూతవేటు దూరంలోని రైతులు నష్టపోయినా ఏలికల్లో చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎపి సీడ్స్, ఆయిల్‌ఫెడ్ వంటి ప్రభుత్వ సంస్థలు సరఫరా చేసిన విత్తనాలపైనే ఫిర్యాదులొస్తున్నాయంటే అవినీతి ఎంతగా పెనవేసుకుందో తెలుస్తుంది. విపత్తుల వలన పంటలు నష్టపోయిన రైతులు బీమా, ఇన్‌పుట్ సబ్సిడీల కోసం నిరీక్షిస్తున్నారు. ఆ చెల్లింపులకు ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. ఖరీఫ్ ప్రారంభ వేళ రైతులను ముసురుకుంటున్న సమస్యలను తక్షణం ప్రభుత్వం పరిష్కరించాలి. సాగునీటి విడుదలపై పారదర్శకంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. ఉత్తుత్తి మాటలు శష్క వాగ్దానాలతో పొద్దుపుచ్చకుండా ఖరీఫ్ సాగు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలూ యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. ఇంతకన్నా గొప్ప నిర్మాణ దీక్ష వేరే ఏదీ లేదు.