అరైకాసు అమ్మన్ ఆలయం రత్న మంగళం, తమిళనాడు
మనకేదైనా ఆపద వచ్చినప్పుడో, కష్టం కలిగినప్పుడో దేవుడి మీద భక్తి ఎక్కువైపోయి అనేక విధాల ఆ భగవంతుడికి మన బాధలు చెప్పటానికి ప్రయత్నిస్తాము. మరి మీదే వస్తువైనా పోయిందనుకోండి. ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు కూడా మీరు రోజూ ప్రార్ధించే దేవుడినే ప్రార్ధిస్తారు. కానీ తమిళ దేశంలో అరై కాసు అమ్మన్ అని ఒక దేవత వున్నది. ఈవిడ భక్తులు పోగొట్టుకున్న విలువైన వస్తువులు, పత్రాలు వగైరా వారు తిరిగి పొందేటట్లు చేస్తుందట. తమ విలువైన వస్తువులను పోగొట్టుకుని, ఎంత వెతికినా దొరకని భక్తులు ఈ తల్లిని ప్రార్ధిస్తారుట. ఈ అమ్మవారి ఆలయం తమిళనాడు రాష్ట్రంలో రత్న మంగళంలో వున్నది. ఈవిడ పేరే విచిత్రంగా వున్నదేమిటనుకుంటున్నారు కదూ. అరై కాసు అమ్మన్ ... అంటే సగం నాణెం తల్లి. ఆ పేరేమిటనుకుంటున్నారుకదూ. ఈవిడకి ఈ పేరు రావటానికి కారణం ....
అనాదినుంచి మనకి అమ్మవార్లను పూజించటం అలవాటు. పుదుక్కోట దగ్గర వున్న గోకర్ణంలో ప్రగడాంబాల్ అనే అమ్మవారు కొలువు తీరి పూజలందుకుంటోంది. ఒకసారి విజయనగరాన్ని పాలిస్తున్న రాజు ఒక ముఖ్యమైన పత్రాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత వెదికినా అది దొరకలేదు. ఆయన ప్రగడాంబాల్ ని ప్రార్ధించాడు. ఆ పత్రం దొరికింది. సంతోషించిన రాజు అమ్మవారికి కృతజ్ఞతగా ఆవిడ రూపాన్ని అరకాసు విలువ వున్న నాణెం మీద ఒక పక్క ముద్రింప చేసి, వాటిని తన రాజ్యంలో వారికి పండుగలు, ఉత్సవాల సమయంలో పంచి పెట్టేవాడు. ఆ రోజులలో అర కాసు నాణేలు అర్ధ వృత్తాకారంలో వుండేవిట. అందుకే అప్పటినుంచీ ఆ తల్లి పేరు అరై కాసు అమ్మగా మారి పోయింది. ప్రజలలో కూడా అమ్మవారి పట్ల విశ్వాసం పెరిగి, తమ పోయిన వస్తువుల గురించి అమ్మవారికి నివేదించటం పెరిగింది. ఆ అమ్మవారు పోయిన వస్తువులు తిరిగి దొరికేటట్లు చేసే చల్లని తల్లిగా పేరొందింది.
తమిళనాడులో రత్న మంగళలో లక్ష్మీ కుబేర ఆలయం వున్నది. ఇక్కడ కుబేరుడికి ప్రతి సంవత్సరం కళ్యాణోత్సవం జరుగుతుంది. ఒకసారి ఆ ఉత్సవ సమయంలో అత్యంత విలువైన లక్ష్మీదేవి ఆభరణం ఒకటి కనిపించలేదు. ఎంత వెతికినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ఆ ఆలయ మేనేజింగ్ ట్రస్టీ అరై కాసు అమ్మవారిని ప్రార్ధించి, ఆ ఆభరణం దొరికితే అరైకాసు అమ్మకి అక్కడ ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నారుట. ఆశ్చర్యంగా ఆ ఆభరణం లక్ష్మీ కుబేర ఆలయంలోనే దొరికింది. ట్రస్టీ వారు కుబేర ఆలయం సమీపంలోనే అరై కాసు అమ్మన్ కి ఆలయం నిర్మించారు.
ప్రస్తుతం అరైకాసు అమ్మ పీఠం తమిళనాడులోనే కాక ఇతర ప్రాంతాలలో కూడా ప్రసిధ్ధి చెందింది. భక్తులు తాము పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందటానికి, పొందాక అమ్మకి కృతజ్ఞతలు తెల్పటానికి అమ్మ దర్శనానికి వస్తారు. వివాహాలు, పిల్లలు, కుటుంబ సభ్యులలో ఎవరైనా తప్పి పోతే వారి ఆచూకీ కోసం, ఆస్తులు, దూరమైన కుటుంబ సభ్యులు తిరిగి కలవటానికి ఇలా ఎన్నో కోరికలు అమ్మవారికి విన్నవించుకుని ఫలితం పొందుతున్నారు.
మంగళ, శుక్ర, ఆదివారాలలో, పౌర్ణమి, అమావాస్యలలో ఈ దేవతలని పూజిస్తే కోరిన కోరిక తప్పక తీరుతుందని నమ్మకం. ఈ రోజులలో అమ్మవారి దగ్గరున్న 108 పత్రాలలోంచి భక్తులు ఒక దానిని తీసుకోవటానికి అనుమతిస్తారు. ఆ కాయితంలో వున్న సూచనల ప్రకారం వారి కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. దీనినే దేవ ప్రశ్న అంటారు.
ఆలయంలో ప్రవేశించగానే ఎడమవైపు విఘ్నాలను నివారించే వినాయకుడు, కుడివైపు క్షేత్ర పాలకుడు కరుప్పన్ ల దర్శనం చేసుకోవచ్చు. పెద్ద హాలులో చుట్టూ అమ్మవార్ల విగ్రహాలు ప్రతిష్టింపబడి, పూజలందుకుంటున్నాయి. ఇవి భారత దేశంలో వివిధ ప్రాంతాలలో పూజలందుకుంటున్న కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి వగైరా 107 దేవతా మూర్తుల విగ్రహాలు. ఆలయం మధ్యలో చిన్న గర్భ గుడిలో అరై కాసు అమ్మ ప్రసన్న వదనంతో భక్తుల కోర్కెలు సదా తీరుస్తానని అభయం ఇస్తున్నదా అన్నట్లు చిరునవ్వుతో దర్శనమిస్తుంది.
దర్శన సమయాలు
ఉదయం 6గం. ల నుంచి 12 గం. ల దాకా, తిరిగి సాయంత్రం 4 గం.ల నుంచి, రాత్రి 8-30 దాకా. అమావాస్యకి, పౌర్ణమికి, ఇతర ఉత్సవాల సమయంలో ఉదయం 6 గం. ల నుంచీ, రాత్రి 8-30 దాకా.
మార్గము
చెన్నైనుంచి చెగల్ పట్ రూట్ లో రైలు ఎక్కి వందలూరులో దిగాలి. వందలూరునుంచి కేలంబాకం వెళ్ళే దోవలో, వందలూరు జూకి 4 కి.మీ.ల దూరంలో వున్నది. వందలూరునుంచి షేర్డ్ ఆటోలు వుంటాయి. . తాంబరంనుంచి రత్నమంగళానికి బస్సులున్నాయి.
సమీప దర్శనీయ ప్రదేశాలు
శ్రీ లక్ష్మీ కుబేర ఆలయం, శ్రీ చక్రకాళి మాత ఆలయం, శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాలు అతి సమీపంలో వున్నాయి.
Credits:
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ