YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

విస్తరిస్తున్న నిఘా కన్ను

 విస్తరిస్తున్న నిఘా కన్ను

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల అదుపులో సీసీ కెమెరాల పాత్ర అధికమే. నిఘా నేత్రం విస్తృత స్థాయిలో ఉంటే నేరాలూ కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అందుకే భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతం పోలీస్ విభాగం సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తోంది. ఈ కెమెరాల సాయంతో ఇప్పటికే పలువురు దోషులను రోజుల వ్యవధిలోనే గుర్తించి అదుపులోకి తీసుకుంది. నిఘా కెమెరాల వల్ల ఈజీగా దొరికిపోతుండడంతో స్థానికంగా చోరీలకూ అడ్డుకట్ట పడింది. ఇదిలాఉంటే సీసీ కెమెరాలను దుకాణాలు, గృహాలు, కూడళ్ల వద్దే కాక పలువురు తమ వాహనాలకూ అమర్చుకుంటున్నారు. ప్రధానంగా కార్లు ముందు లేదా వెనుక భాగాల్లో ఈ తరహా కెమెరాలు ఏర్పాటు ఉండడంతో ప్రమాదాలకు కారకులైన వారినే కాక సదరు వాహనంపై దాడికి యత్నించిన వారినీ సులువుగా గుర్తించడానికి వీలుంటుంది. జిల్లాలో దాదాపు వెయ్యి వాహనాలకు పైగా సీసీ కెమెరాలు ఉన్నట్లు సమాచారం. 

సీసీ కెమెరాలు అందుబాటు ధరలోనే ఉండడంతో పలువురు వీటిని గృహాల వద్దా అమర్చుకుంటున్నారు. దీంతో తమకు భరోసాగా ఉంటోందని చెప్తున్నారు. విరివిగా నిఘా కళ్లు ఉన్న ప్రాంతాల్లో నేరాల సంఖ్య తగ్గినట్లు పోలీసులు కూడా చెప్తున్నారు. ఇదిలాఉంటే సింగరేణి ప్రాంతం అంతటా పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాల్లో సింగరేణి యాజమాన్యం భారీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తోంది. కాలనీలు, కార్యాలయాలు, బొగ్గుగనుల్లో వీటిని అమర్చుతున్నారు. మొత్తంగా 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.  పోలీసులు సింగరేణి సహాయం కోరడంతో యాజమాన్యం స్పందించి వీటిని ఏర్పాటు చేస్తోంది. నిఘా కెమెరాల ఏర్పాటుతో భద్రతకు భరోసా ఉంటుంది. దీంతో సామాన్యులు సైతం తమ నివాసాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకుంటున్నారు. మొత్తంగా ఈ తరహా కెమెరాలతో నేరాలకు అడ్డుకట్టపడుతోంది.

Related Posts