రాజస్థాన్ లో అమెరికా తరహా ఘటన
జైపూర్, జూన్ 6,
రాజస్థాన్‌లో అమెరికా తరహా ఘటన చోటు చేసుకుంది. జోధ్‌పూర్ పోలీసులు ఓ వ్యక్తిని కాళ్లతో నొక్కిపట్టి చితకబాదిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేస్ మాస్క్ ధరించని కారణంగా పోలీసులు అతడిపై అమానుషంగా దాడి చేశారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అమెరికాలో నల్ల జాతీయుడు ‘జార్జ్ ఫ్లాయిడ్’ మరణంతో ఈ ఘటనను పోలుస్తూ కామెంట్లు పెడుతున్నారు. జోధ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ముకేశ్ కుమార్ ప్రజాపత్ అనే వ్యక్తి చేతులను ఓ పోలీస్ కానిస్టేబుల్ వెనక్కి విరిచి పట్టుకోగా, మరో కానిస్టేబుల్ తన మోకాలిని ఆ వ్యక్తి మొడపై పెట్టి తన ప్రతాపం చూపించినట్లుగా వీడియోలో ఉంది. ఇటీవల అమెరికాలోని మిన్నియాపొలిస్ సిటీ పోలీసుల చేతిలో జార్జ్ ఫ్లాయిడ్ ఇలాగే ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. ఈ ఘటనపై దేశంలో దుమారం రేగుతోంది.జోధ్‌పూర్ నగరంలోని ఓ థియేటర్ ముందు గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ముకేశ్ కుమార్ ప్రజాపత్ దాడి చేసిన తర్వాతే కానిస్టేబుళ్లు స్పందించారని.. అతడే దురుసుగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. పోలీసుల విధులను అడ్డుకున్నాడనే ఆరోపణలతో అతడిపై కేసు నమోదు చేసి, శుక్రవారం కోర్టులో హాజరుపరిచి కస్టడీకి పంపారు.ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో జోధ్‌పూర్ పోలీస్ కమిషనర్ ప్రఫుల్ కుమార్ వివరణ ఇచ్చారు. సదరు వ్యక్తిని మాస్క్ ఎందుకు ధరించలేదని పోలీసులు ప్రశ్నించగా.. వారితో అతడు దురుసుగా ప్రవర్తించాడని ఆయన తెలిపారు. అతడి దాడిలో ఓ పోలీస్ అధికారి యూనిఫాం కూడా చిరిగిపోయిందని చెప్పారు. పోలీసులపై ఎదురుదాడికి దిగిన అతడిపై బలం ప్రయోగించాల్సి వచ్చిందని వివరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు గతంలో తన కన్నతండ్రిపైనే దాడి చేసి ఆయన కన్ను పోవడానికి కారణమయ్యాడని.. ఆ ఘటనకు సంబంధించి అతడిపై కేసు ఉందని పోలీస్ కమిషనర్ తెలిపారు.