YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

తవ్వినకాడికి దోచేయ్.

తవ్వినకాడికి దోచేయ్.

తవ్వినకాడికి దోచేయ్.. (కృష్ణాజిల్లా)
మచిలీపట్నం, జూన్ 07: జిల్లాలో ప్రధాన పంట కాలువల్లో లజ్జబండ డ్రెయిన్‌ ఒకటి. దీని కింద దాదాపు 65 వేల ఎకరాల భూములు ఉన్నాయి. గూడూరు నుంచి మొదలై పెడన మండలం మీదుగా బందరు మండలం తాళ్లపాలెం వద్ద బంగాళాఖాతంలో కలిసే ఈ మేజర్‌ డ్రెయిన్‌కు రెండు వైపులా 5 వేల ఎకరాలకుపైగా చెరువులు విస్తరించాయి. గూడూరు నుంచి 25 కి.మీ.ల పొడవునా ప్రయాణించే లజ్జబండ డ్రెయిన్‌లోకి వివిధ ప్రాంతాల్లో పలు మీడియం డ్రెయిన్లు కలుస్తాయి. మండలంలోని కొంకేపూడి పంచాయతీ పరిధిలో లజ్జబండ డ్రెయిన్‌కు రెండు వైపులా ఉన్న ఖాళీ భూములతోపాటు గట్లను కొంతమంది వ్యక్తులు తవ్వి మట్టిని ఇతర ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ మట్టిని రూ.వెయ్యి వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. లజ్జబండలోకి వడ్లమన్నాడు మైనర్‌ డ్రెయిన్‌ కలిసే ప్రాంతంలో కొద్ది రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి. రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు పొక్లెయిన్‌తో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. నిర్మాణాల్లో ఎత్తు పెంచేందుకు వినియోగించే ఈ మట్టికి ఈ ప్రాంతంలో డిమాండ్‌ ఉంది. భారీ వర్షాలు, తుపానుల సమయంలో లజ్జబండ డ్రెయిన్‌ పొంగి పంట భూములను ముంచెత్తుతుంది. ఇలా వేలాది ఎకరాల్లో పంటకు నష్టం జరిగిన సంఘటనలు గతంలో నమోదయ్యాయి. ప్రస్తుతం గట్లను, పక్కన ఉన్న భూములను తవ్వేయటంతో అధిక ప్రవాహ సమయంలో గట్లు తెగి గ్రామాలను నీరు ముంచెత్తే ప్రమాదం ఉందని కొంకేపూడి, ఈదుమూడి గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండవల్లి కొల్లేరు ప్రధాన లంక గ్రామాలకు తాగునీటిని అందించే గుడివాడ పంట కాలువను ఆక్రమార్కులు వదలడం లేదు. చేపల చెరువుల మరమ్మతుల ప్రక్రియలో భాగంగా ఛానల్‌ను పూర్తిగా ఆక్రమించేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇంగిలిపాకలంకలో ఓ చేపల చెరువు నిర్వాహకుడు ఏకంగా చెరువులో మట్టిని తీసుకువచ్చి కాలువను పూడ్చివేస్తున్నారు.. ఇంగిలిపాకలంక నుంచి శ్రీరామ్‌నగర్‌, నందిగామలంక, పెనుమాకలంక వరకు తాగునీరు, వాడుక నీటిని అందించేందుకు ఇదే ప్రధాన నీటి వనరు. కాని పక్కనే ఉన్న చేపల చెరువుల యజమానులు ఏటా కొంత మేరకు ఆక్రమించడంతో కాలువ బక్కచిక్కిపోయి కనీసం కిందకు నీరు వెళ్లే మార్గం లేకుండాపోయింది.

Related Posts