YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మామిడి దిగాలు

మామిడి దిగాలు

మామిడి దిగాలు (చిత్తూరు)

చిత్తూరు, జూన్ 07 జిల్లాలో ఏటా ఈ సమయానికి మార్కెట్లలోని మండీలు మామిడి కాయలతో నిండుగా కనిపించాల్సి ఉంది. అందుకు భిన్నంగా మండీలు వెలవెలబోతున్నాయి. దిగుబడి అతి తక్కువ స్థాయికి పడిపోవడంతో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని రైతులు ఆశించారు. కానీ ఏటా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు కరోనా ప్రభావంతో అక్కడే ఉండిపోవడంతో ధరల సంగతేమోకానీ కొనేవారు తగ్గిపోయారు. దీంతో స్థానిక వ్యాపారులు మామిడిని ఆన్‌లైన్‌ వ్యాపారంగా మార్చేశారు. వ్యాపారులు సామాజిక మాధ్యమాలను వినియోగించి లావాదేవీలను ప్రారంభించారు. బయటి రాష్ట్రాల వ్యాపారులకు స్థానిక మండీ యజమానులతో ఉన్న పరిచయం, విశ్వాసం ఇందుకు బాగా ఉపయోగపడుతోంది. వాట్సాప్‌ వీడియో కాలింగ్‌ ద్వారా మండీల్లో కాయల నాణ్యతను అక్కడి వ్యాపారులకు చూపుతున్నారు. వారు నాణ్యతను పరిశీలించి బేేరమాడుతున్నారు. ట్రక్కులు, లారీలను పంపి కాయలను కొంటూ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. భవిష్యత్తులో మామిడి ఎగుమతులంతా ఆన్‌లైన్‌ ద్వారా జరిగేలా అవకాశాలను మెరుగు పరుచుకునేందుకు సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహన పెంచుకుంటున్నారు. దామలచెరువు మ్యాంగోనగర్‌తో పాటు చిత్తూరు, తిరుపతి, పుత్తూరు, బంగారుపాళ్యం మార్కెట్లలో మండీలకు తగినంతగా కాయలు రావడం లేదు. కొన్ని మండీల్లో కిలోల్లోనే కాయలుండగా మిగిలిన చోట్ల ఖాళీగా ఉన్నాయి. కేవలం 25 శాతం మండీల్లోనే ఓ మోస్తరు వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. జిల్లా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దిగుబడికి తగినట్లు ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. మరో 20 రోజుల పాటు ఇదే తరహాలో వ్యాపారం జరిగి సీజన్‌ ముగుస్తుందని భావిస్తున్నారు. తోతాపురి, పుల్లూరా, ఖాదర్‌ రకం కాయలను గుజ్జు పరిశ్రమలకు తరలించేందుకు రైతులు ఆసక్తి చూపుతుండగా మిగతా రకాల కాయలు మండీలకు వస్తున్నట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. రంగు కాయలు రూ.20వేల వరకు అమ్ముడుపోతున్నాయి. పుల్లూరా రకాన్ని గుజ్జు వ్యాపారులు రూ.13 వేలతో కొంటున్నారు. రంగు తేలిన కాయలను బయటి వ్యాపారులు రూ.25 వేలకు తీసుకెళుతున్నారు. ఖాదర్‌ రకం కాయలు రూ.25వేల నుంచి రూ.32 వేలకు అమ్ముతున్నాయి. బేనీషా రూ.30-38 వేల మధ్య పలుకుతోంది. ఇమాం పసంద్‌, మలగూబా కాయలు అరుదుగా మండీలకు వస్తున్నా వాటి ధర అత్యధికంగా రూ.60-70 వేలు పలుకుతోంది.


 

Related Posts