YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కాలకూటం పారుతోంది

కాలకూటం పారుతోంది

కాలకూటం పారుతోంది (పశ్చిమగోదావరి)
భీమవరం, జూన్ 07:  పచ్చని జిల్లాలో పంట కాలువలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. నల్లని రంగుతో చూసేందుకు భయానకంగా ఉంటున్నాయి. కొన్నిచోట్ల అయితే డ్రెయిన్లను తలపిస్తున్నాయి. కాలువల్లో నీటిని విడిచిన సమయంలో కాలుష్య కారకాలు జలాలతో కలసి ఆ నీటినే ప్రజలు తాగాల్సి వస్తోంది. పంట కాలువలను పరిరక్షించాల్సిన జలవనరుల శాఖ అలసత్వంతో తాగునీరు కలుషితం అవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో వస్తున్న చెత్తను ఇష్టారాజ్యంగా పంట కాలువల్లో వేస్తుండటం కూడా సమస్యకు కారణం అవుతోంది. ఫలితంగా లక్షల మందికి తాగు, సాగునీరు అందించాల్సిన పంట కాలువలు ప్రమాదకర రసాయనాలకు నిలయంగా మారిపోతున్నాయి. గోస్తనీ- వేల్పూరు పంట కాలువ శెట్టిపేట వద్ద ప్రారంభమై తణుకు, వేల్పూరు, బ్రాహ్మణ చెర్వు, పెనుమంట్ర, మాముడూరు మీదుగా భీమవరం చేరుతుంది. దీని పొడవు 54 కి.మీ. దీని పరిధిలో మొత్తం 68,369 ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. 6 మండలాల్లోని వేల గ్రామాల ప్రజలు తాగునీటి కోసం దీనిపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా తీవ్రంగా కలుషితమైపోయింది. డెల్టా ప్రాంతంలో అనాకోడేరు పంట కాలువకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దీని పొడవు మొత్తం 12 కి.మీ. భీమవరం, కాళ్ల మండలాల పరిధిలో అనేక గ్రామాల ప్రజలకు సాగు, తాగునీటికి ఈ కాలువే ఆధారం. 16 వేల ఎకరాల వరి ఆయకట్టు దీనిపై ఆధారపడి ఉంది. భీమవరం పట్టణ పరిధిలో అనేక చోట్ల మురుగునీటి గొట్టాలను నేరుగా దీనిలోకి ఏర్పాటు చేశారు. గతంలో కొన్నిచోట్ల గొట్టాలను అధికారులు తొలగించారు. అయినా చాలా చోట్ల ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నాయి. కొమరాడ పంట కాలువ పొడవు నాలుగు కిలోమీటర్లు. దీని పరిధిలో 4వేల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. 5 గ్రామాల ప్రజలకు తాగునీరు ఈ కాలువ ద్వారానే అందుతుంది. హోటళ్ల వ్యర్థాలు, ఆక్వా పరిశ్రమల్లో కలుషిత నీరు చాలా చోట్ల నేరుగా దీనిలో విడిచిపెడుతున్నారు.  లోసరి పంట కాలువ డెల్టాలో అత్యంత ప్రధానమైంది. దీని పొడవు 20 కి.మీ. దీనిపై ఆధారపడి 9 వేల ఎకరాల ఆయకట్టులో వరి సాగు జరుగుతోంది. అనేక గ్రామాల ప్రజలకు తాగునీటికి ఈ కాలువే ఆధారం. కొన్నేళ్ల కిందట డెల్టా ఆధునికీకరణలో భాగంగా భారీ వ్యయంతో ఈ కాలువను ప్రక్షాళన చేశారు. నరసాపురం, అత్తిలి ప్రధాన కాలువలు చాలా కాలంగా కాలుష్యకారకాలుగా మారిపోయాయి. వీటి పరిధిలో సుమారు 70 వేల ఎకరాల వరి ఆయకట్టు ఉంది. వందలాది గ్రామాల ప్రజలకు తాగునీరు ఈ కాలువల ద్వారానే అందుతుంది. పశ్చిమడెల్టాలోని ప్రధాన పంట కాలువల్లోకి చాలా చోట్ల మురుగునీటి గొట్టాలను నేరుగా ఏర్పాటు చేస్తున్నారు. ఆక్వా పరిశ్రమలు, హోటళ్లు, ఇళ్లలోని వాడకం నీరు పంట కాలువల్లోకి చేరి వాటి రూపు మారిపోతుంది. చాలాచోట్ల ఇష్జారాజ్యంగా చెత్తను వాటిలో వేస్తున్నారు. ఆ చెత్త కుళ్లిపోయి క్రమంగా తీవ్ర దుర్గంధపూరితంగా తయారవుతున్నాయి. అనేక చోట్ల కాలువలు ప్లాస్టిక్‌ వ్యర్థాలతో దర్శన మిస్తున్నాయి. ప్రస్తుతం పంట కాలువల్లో నీరు లేకపోవడంతో ఎక్కడెక్కడ మురుగుగొట్టాలు ఏర్పాటు చేశారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

Related Posts