పుస్తకాలొచ్చేస్తున్నాయ్.. (కరీంనగర్)
కరీంనగర్, జూన్ 07 కొత్త విద్యా సంవత్సర ముహూర్తం సమీపిస్తోంది. లాక్‌డౌన్ కారణంతో నిలిచిన పాఠ్యపుస్తకాల సరఫరాలో విద్యాశాఖ మళ్లీ వేగం పెంచింది. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసేందుకు చర్యలు ముమ్మరం చేస్తోంది. జిల్లాలోని పాఠశాలల్లో అభ్యసించే విద్యార్థులకు 2,39,441 పాఠ్య పుస్తకాలు అవసరం ఉందని జిల్లా అధికారులు ప్రతిపాదించారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమ పుస్తకాల జాబితా నివేదించారు. వాస్తవంగా వేసవి సెలవుల్లోనే పాఠశాలలకు పంపిణీ చేయాలని భావించారు. అయితే కరోనా కారణంగా జిల్లాలకు సరఫరా చేయడంలో జాప్యం నెలకొంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో కొన్ని ఆంక్షలు ఎత్తివేయడంతో పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుతున్నాయి. ఇప్పటి వరకు 1,57,000 వరకు జిల్లాకు వచ్చాయి. గత ఏడాదికి సంబంధించి సుమారు 18వేల వరకు అందుబాటులో ఉన్నాయి. పాఠ్య పుస్తకాలను గోదాములో భద్రపరుస్తున్నారు. జిల్లాలో 357 ప్రాథమిక, 83 ప్రాథమికోన్నత, 105 ఉన్నత పాఠశాలలు, 7 ఆదర్శ, 10 కస్తూర్బా, 6 గురుకుల పాఠశాలల్లో సుమారు 39 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. బడి ఈడు పిల్లలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తోంది. యూడైస్ సమాచారం ఆధారంగా విద్యార్థులకు వీటిని సరఫరా చేస్తున్నారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో పుస్తకాలు వస్తున్నాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంతో పంపిణీకి విఘాతం కలిగింది. 10 రోజులుగా విడతల వారీగా జిల్లాకు పుస్తకాలు చేరుతున్నాయి. పాఠశాలల పునఃప్రారంభంనాటికి ముందుగానే మండల కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ నుంచి పాఠశాలలకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠ్య పుస్తకాలు పక్కదారి పట్టకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రతి పుస్తకానికి ఆరు అంకెలతో వరస సంఖ్య ముద్రించారు. ఎవరైనా వీటిని విక్రయిస్తే ఈ సంఖ్య ఆధారంగా ఏ జిల్లా, మండలం, పాఠశాలకు పంపిణీ చేశారో తేలనుంది. విక్రయించిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.