YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 నంద్యాలలో  మినరల్ దందా

 నంద్యాలలో  మినరల్ దందా

 నంద్యాలలో  మినరల్ దందా
కర్నూలు,  జూన్ 8,
నంద్యాల పట్టణంలో మినరల్‌ వాటర్‌ దందా మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. మినరల్‌ వాటర్‌ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీటిలో అనేక ప్లాంట్లు కనీసం నాణ్యత ప్రమాణాలు కూడ పాటించడం లేదు. ఒక లీటర్‌ శుద్ధజలం కావాలంటే కనీసం 3 లీటర్ల నీరు శుద్ధి చేయాల్సి ఉంది. ఆ మేరకు చేయడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి ప్లాంట్‌ నుంచి రోజుకు 5 వేల లీటర్లకు తగ్గకుండా నీటిని అమ్ముతున్నారని, ఈ లెక్కన నంద్యాల పట్టణ వ్యాప్తంగా నిత్యం రూ. 30 నుంచి 40 లక్షలకు పైబడే మినరల్‌ వాటర్‌ వ్యాపారం జరుగుతుందని అంచనా. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో మినరల్‌ వాటర్‌ దందా మరింతగా పెరిగింది. 20 లీటర్ల క్యాన్‌ను రూ.20 నుంచి రూ.30 మొదలు కొని కూలింగ్‌ పేరుతో అమ్ముతున్నారు. ఆటోల ద్వారా ఇళ్లకు చేరిస్తే కూలింగ్‌ రూ.20 చొప్పున విక్రయిస్తూ ప్లాంట్ల యజమానులు దండుకుంటున్నారు.  ప్రజలకు మంచినీరు అందించడంలో పాలకులు విఫలం కావడంతో మినరల్‌ వాటర్‌ను కొనుగోలు చేసి తాగాల్సి వస్తుంది. ఈ తరుణంలో ప్రతి కుటుంబం మంచినీటిని కొనుగోలు చేయడానికి నెలకు రూ.300నుంచి రూ.500లకు తగ్గకుండా ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రజలు రోజురోజుకు మినరల్‌ వాటర్‌ తాగడానికి అలవాటు పడిపోవడంతో డిమాండ్‌ భారీగా పెరిగింది. దీంతో పుట్టగొడుగుల్లా మినరల్‌ ప్లాంట్లు వీధికొకటి, సందుకొకటి వెలుస్తున్నాయి. నంద్యాల పట్టణంలో శిల్పా సహకార్‌ ఆధ్వర్యంలో 15, మాజీ ఎంపి ఎస్‌పివైరెడ్డి ఆధ్వర్యంలో 18, ఎన్‌టిఆర్‌ సుజలా ఆధ్వర్యంలో 3 మాత్రమే మినరల్‌ వాటర్‌ప్లాంట్లు మున్సిపల్‌ లెక్కల్లో ఉన్నాయి. పట్టణంలో ప్రైవేట్‌ వ్యక్తులు నిర్వహిస్తున్న వాటిపై వాటర్‌ ఫిట్టర్లు సర్వే నిర్వహించగా 42 వార్డులకు 25 మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఉన్నట్లు తేలింది. ఒక్కో వార్డులో కొన్ని చోట్ల ఒకటి, రెండు, మూడు మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. ఇంకా లెక్కకు రానివి పట్టణంలో దాదాపు 84 మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయని పట్టణ ప్రజలు చెబుతున్నారు. మున్సిపల్‌ ఆధికారులకు నెలనెలా భారీగా మామ్ముళ్లు అందుతుండడంతో పట్టణంలో కేవలం 25 మాత్రమే ఉన్నట్లు లెక్కలు చూపుతున్నారు. వీటికి కూడా మున్సిపల్‌ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేనట్లు తెలుస్తోంది. మినరల్‌ వాటర్‌ ప్లాంట్లలో ఐఎస్‌ఐ గుర్తింపు, ఐఎస్‌ఒ గుర్తింపు పత్రాలు ఉండాలి. గుర్తింపు పత్రాలు ఉన్నప్పటికీ ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అనేక ప్లాంట్లు నీటి విక్రయాలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు పేరొంటున్నారు. బ్రాండెడ్‌ కంపెనీల పేర్లతో నడిపే వాటర్‌ ప్లాంట్లలో బయాలజిస్ట్‌, కెమిస్ట్‌, 10 గదులు, మంచినీటి పరీక్షలు ల్యాబ్‌, శుద్ధి చేసిన జలాలను నిల్వ చేసేందుకు 304గ్రేడ్‌ స్టేయిన్‌లెస్‌ స్టిల్‌తో తయారు చేసిన ట్యాంకులు ఉండాలి. ఇక పట్టణంలో వీధికి ఒకటిగా ఉన్న వాటర్‌ ప్లాంట్లలో ఇవేమి లేకుండానే ఎస్‌ఎల్‌ స్టీల్‌ డ్రమ్ములు పెట్టి, బోరుద్వారా నీటిని తీసి క్లోరింగ్‌ శాతం కలిపి అరకొర శుద్ధితో మినరల్‌ వాటర్‌ అంటూ పట్టణంలో అమ్మేస్తున్నారు. అనేక చోట్ల ప్లాస్టిక్‌ డ్రమ్ములు వాడుతున్న అధికారులు కన్నెత్తి చూడడం లేదు. క్యాన్‌లోకి నీటిని పట్టే ముందు నిల్వ ఉంచాల్సి వస్తే ఆల్ట్రా వయోలిన్‌ కిరణాలతో శుద్ధి చేసి నీరు పట్టాల్సి వుంది. ఇవేమి ప్లాంట్లలో కనిపించడం లేదు.  మినరల్‌ వాటర్‌ క్యాన్‌ 20 నుంచి 30వరకు అమ్మే ప్లాంట్ల యజమానులు ట్రేడ్‌ లైసెన్స్‌లు ఛారిటి ట్రస్టు పేరుతో తీసుకొని సేవా పేరుతో వ్యాపారం చేస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. మినరల్‌ వాటర్‌ ప్లాంట్లకు మున్సిపల్‌ అధికారులు అనుమతి ఇవ్వాలన్న విషయం తెలియదు. పట్టణంలో మున్సిపల్‌ ఫిట్టర్లతో వార్డులలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లపై సర్వే చేయించగా 25 మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఉన్నట్లు గుర్తించాం. మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల వారు మాకు ఎలాంటి మామూళ్లు ఇవ్వడం లేదు. పై అధికారులతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లపై చర్చించి మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల యజమానులకు నోటీసులు జారీ చేస్తాం. నోటీసులకు స్పందించి మున్సిపల్‌ అనుమతి తీసుకోకపోతే మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను సీజ్‌ చేస్తాం. మున్సిపల్‌ ఆదాయాన్ని పెంచేవిధంగా చర్యలు తీసుకుంటూ మినరల్‌ వాటర్‌ ప్లాంట్లపై తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతాం.

Related Posts