YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జిల్లాల్లో వైసీపీ కోటరీలు

జిల్లాల్లో వైసీపీ కోటరీలు

జిల్లాల్లో వైసీపీ కోటరీలు
విజయవాడ, జూన్ 8,
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై.. ఏడాది పూర్తి అయింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు, విస్తృత‌మైన ప్రభుత్వ ప‌థ‌కాల‌తో దూసుకుపోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. జాతీయ స్థాయిలో నిర్వహించిన స‌ర్వేలోనూ ఏపీ సీఎం జ‌గ‌న్ .. ఉత్తమ సీఎంగా నాలుగో స్థానంలో నిలిచారు. చాలా త‌క్కువ స‌మ‌యంను బ‌ట్టి చూస్తే గ‌తంలో ఏ సీఎంకు ఏపీలో ఇంత గౌర‌వం ద‌క్క‌లేదు. ఇలా దూసుకుపోతున్న ప్రభుత్వంలో పంటికింద రాయి మాదిరిగా.. కొన్ని ప‌రిణామాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. కొన్ని జిల్లాల్లో మంత్రులు రెచ్చిపోతున్నార‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. త‌మ క‌నుస‌న్నల్లోనే అన్నీ జ‌ర‌గాల‌ని, త‌మ వారికి మాత్రమే ప‌నులు చేయాల‌నే ఆదేశాలు వెళ్తున్నాయి.మ‌రీ ముఖ్యంగా ఇత‌ర పార్టీల నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న నాయకుల‌కు ప్రాధాన్యం లేకుండా పోతోంద‌నే విమ‌ర్శలు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో జిల్లాల్లో మంత్రులు.. కొంద‌రికి మాత్రమే అప్పాయింట్ మెంటు ఇస్తూ.. సొంత పార్టీనే అయిన‌ప్పటికీ.. మ‌రికొంద‌రు ఎమ్మెల్యేల‌ను ఇబ్బందికి గురి చేసేలా వ్యవ‌హ‌రిస్తున్నారని అనంత‌పురం నుంచి ఆముదాల వ‌ల‌స వ‌ర‌కు కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మంత్రులు బ‌లంగా లేని జిల్లాల్లో ఎమ్మెల్యేలు చ‌క్రం తిప్పుతున్నారు. దీంతో సొంత పార్టీలోనే ఎగ‌స్పార్టీ నేత‌లు పెరుగుతున్నారు. ఈ ప‌రిణామాలు పార్టీని రోడ్డున ప‌డేలా చేస్తున్నాయి.నిన్నటికి నిన్న ఆనం రామనారాయ‌ణ‌రెడ్డి రోడ్డెక్కారు. ఆయ‌న టార్గెట్ అంతా జ‌ల‌వ‌న‌రుల మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌పైనే ఉంది. ఇక ఇదే జిల్లాలో స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థన్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే న‌ల్లపురెడ్డి ప్రస‌న్నకుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లా కందుకూరు నియోకజకవర్గంలో తాగు నీటి సమస్యను పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే మ‌హీధ‌ర్‌రెడ్డి రోడ్డెక్కారు. ఒంగోలు జడ్పీ ఆఫీస్ ఎదుట బైఠాయించి రెండు రోజుల కింద‌ట హంగామా సృష్టించారు.ఇక‌ విశాఖ‌లోనూ చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మశ్రీ.. త‌మకు అధికారులు ప‌నులు చేయ‌డం లేద‌ని, తెర‌వెనుక ఎవ‌రో చ‌క్రం తిప్పుతున్నార‌ని, ప‌రిస్థితి ఇలానే ఉంటే.. పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యార‌వుతుంద‌ని రోడ్డెక్కారు. అదే జిల్లాలో మ‌రో ఇద్దరు ఎమ్మెల్యేల‌ది అదే ఆవేద‌న‌. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎస్సీ ఎమ్మెల్యేలు సైతం త‌మ‌ను ఎవ్వరూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెపుతున్న ప‌రిస్థితి. ఇక స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం సైతం రాష్ట్రంలో అక్రమ మ‌ద్యం వ్యాపారం తీవ్రంగా ఉంద‌ని చేసిన వ్యాఖ్యలు సంచ‌ల‌న‌మ‌య్యాయి. ఇవి పార్టీకి, ప్రభుత్వానికి పెద్ద మైన‌స్ అయ్యాయి.గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అయితే అస‌లు ఇసుక అనేది రీచ్ నుంచి లారీలో తెచ్చుకుందామ‌న్నా లారీలు మ‌ధ్యలోనే మాయ‌మ‌వుతున్నాయ‌ని విమ‌ర్శించారు. ఇక వైసీపీ అసంతృప్త ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు అయితే ఓ ఎంపీగా ఉండి తాను ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా తెప్పించుకోలేక పోయాన‌ని చెప్పారు. వీరంతా బ‌య‌ట‌కు చెప్పుకొంటున్నారు. మ‌రికొంద‌రు వైసీపీ నాయ‌కులు అంత‌ర్గత సంభాష‌ణ‌ల్లో ఆవేద‌న , ఆక్రంద‌న‌, ఆక్రోశం వెళ్లగ‌క్కుతున్నారు. ఈ ప‌రిస్థితి ఇలానే కొన‌సాగితే.. పార్టీకి దీర్ఘకాలంలో న‌ష్టం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. మ‌రి దీనిపై జిల్లా ఇంచార్జ్ మంత్రులు దృష్టి పెడ‌తారా? పెట్టరా? అనేది చూడాలి.

Related Posts