కళకళలాడిన చేపల మార్కెట్
హైద్రాబాద్, జూన్ 8,
ఒక వైపు కరోనా వైరస్ వ్యాప్తితో జనం భయపడిపోతున్నారు. దీనికి తోడు వేసవి వేడి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కృత్తిక, రోహిణి కార్తెలో ఎండలతో అల్లాడిపోయే జీవకోటికి మృగశిర కార్తె ప్రవేశంతో ఉపశమనం లభిస్తుంది.. వర్షారంభానికి సూచనగా భావించే ఈ కార్తెలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దీంతో వాతావరణం చల్లబడుతుంది. చల్లబడిన వాతావరణంతో మానవ శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గి, వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.. నేడు రోహిణి కార్తె ముగిసి రేపటి నుండి మృగశిర కార్తె ప్రారంభం కానుంది.. మృగశిర కార్తె ప్రారంభం రోజు చేపలు తింటే వ్యాధులు దూరమవుతాయనేది బలమైన నమ్మకం. దీంతో నేడు నగరంలో చేపల మార్కెట్లు రద్దీగా మారాయి.. మృగశిర కార్తె చేపల మార్కెట్లో అమ్మకాలు జోరుగా ఉంటాయి. ధరలు కూడా మిగతా రోజుల కంటే రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఉదయం నుంచే చేపల మార్కెట్ జన సందోహంతో నిండిపోయింది. రకరకాల చేపలను అమ్మకందారులు తీసుకువచ్చారు. ఒక్కో చేప రకానికి ఒక్కో ధరను నిర్ణయించారు.మిగతా రోజులతో పోల్చుకుంటే ఈరోజు ధర రెట్టింపు స్థాయిలో ఉన్నది. కొర్రమీను ధర రూ.700లకు కిలో పాత రేటు రూ.500లు కిలో, రవ్ రూ.180, పాత ధర 120, బంగారు తీగ రూ.160, పాత ధర రూ.100, పరకలు రూ.200 పాత ధర రూ.120లుగా పలుకుతున్నాయి.మృగశిర అడుగిడిన తొలిరోజే చేపలు తినడం అనేది ప్రజల్లో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. దీంతో మార్కెట్‌లో చేపల ధరలు ఆకాశాన్ని తాకాయి. సాధారణ రోజులతో పోలిస్తే వీటిని రెట్టింపు ధరలతో విక్రయించినా ప్రజలు ఎగబడి మరీ కొంటున్నారు.మృగశిర కార్తెను పురస్కరించుకుని నగరంలో చేపమందు పంపిణీ జరిగేది. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా చేపమందు పంపిణీ రద్దయింది. చేపమందు వుంటే ధరలు మరింత ఎక్కువగా వుంటాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో చేపల ధరలను ప్రభుత్వం నిర్ణయించాలని వినియోగదారులు కోరుతున్నారు. సాధారణ ధర కంటే 200 శాతం అధికంగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని చేపల మార్కెట్ లో అన్ని కూడా బిజీగా ఉన్నాయి. చేపల కొనుగోలుదారులతో రద్దీ పెరిగిపోయింది. ముషీరాబాద్ తర్వాత బేగంబజార్, మెహిదీపట్నంలలో భౌతిక దూరం లేకుండానే చేపల మార్కెట్ రద్దీగా మారింది.