ట్యాక్సులపై కరోనా బండ
హైద్రాబాద్, జూన్ 8
రాష్ట్ర రాజధాని.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతోంది. ఆస్తిపన్ను వసూలు కాక.. ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులూ ఇవ్వక.. అభివృద్ధి పనుల కోసం అప్పులు తెస్తోంది. ఇలాంటి స్థితిలోనూ హైదరాబాద్ విశ్వనగరం దిశగా ఎలా వెళ్తుందని సామాన్య జనం అంటున్నారు. కానీ, ఖజానాలో డబ్బుల్లేక మహానగరపాలక సంస్థ దివాలా తీసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.5,495.62కోట్ల ఆస్తిపన్ను బకాయిలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ భవనాలు/ఆస్తులకు సంబంధించినవే రూ.3వేల కోట్లు ఉండటం గమనార్హం.కోటికిపైగా జనాభా ఉన్న మహానగరంలో 16,39,238 మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఉన్నారు. వీరి నుంచి రూ.2,495.62కోట్లు రావాల్సి ఉంది. 2019-20లో 9,89,524 మంది ద్వారా రూ.1,394.72కోట్లు వసూలైంది. మిగిలిన 5,64,294 మంది నుంచి రూ.1,477.86కోట్లతో పాటు దీనిపై వడ్డీ మరో రూ.1,017.76కోట్లు కలిపి మొత్తం రూ.2,495.62కోట్లు పేరుకుపోయాయి. వీటితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్యాలయాలు, భవనాలు, ఆస్తులకు సంబంధించిన బకాయిలు రూ.3వేల కోట్లు ఉన్నాయి. ఇలా మొత్తం జీహెచ్‌ఎంసీకి రావాల్సిన ఆస్తిపన్ను బకాయిలు రూ.5,495.62కోట్లు ఉన్నాయిరాష్ట్ర ప్రభుత్వం నుంచి బల్దియాకు ఎలాంటి సాయమూ అందడం లేదు. ఆరేండ్ల కాలంలో ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్‌లోనూ జీహెచ్‌ఎంసీకి ప్రత్యేక కేటాయింపుల్లేవు. అంతేకాదు, జీహెచ్‌ఎంసీకి హక్కుగా రావాల్సిన మోటార్ వాహన, వృత్తి, వినోదపు పన్నులకు సంబంధించిన పరిహారం ఇవ్వడం లేదు. ఆస్తిపన్ను మాత్రం ఏడాదికి రూ.10లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రోడ్డు విస్తరణకు సర్కార్ నుంచి నయా పైసా ఇవ్వలేదు. దాంతో పైసల్లేక బాండ్ల ద్వారా రూ.495కోట్లు, బ్యాంకు రుణం రూ.2,500కోట్లు తీసుకుని ఎస్‌ఆర్‌డీపీ పనులు చేపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ పాలకవర్గం పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుండటంతో ఎన్నికల కోసం ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, దుర్గంచెరువుపై కేబుల్ బ్రిడ్జిని వేగంగా పూర్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బల్దియా పాలకవర్గం పావులు కదుపుతోంది. అందులో భాగంగా, పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మాఫీ చేయడానికి అనుమతి కోసం స్థాయీ సంఘం సమావేశం తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. జీహెచ్‌ఎంసీకి రావాల్సిన రూ.1,477.86కోట్లకు సంబంధించిన వడ్డీ రూ.1,017.76కోట్లు ఉంది. ఈ వడ్డీని మాఫీ చేయడానికి 'వన్‌టైం ఆమ్నెస్టీ స్కీం' కింద వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాలని స్థాయీ సంఘం సమావేశం తీర్మానించింది. ఒకవేళ వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తే జీహెచ్‌ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని, చెల్లించకపోతే బల్దియా ఖజానాకు భారీగా గండిపడే అవకాశముందని ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.