రైతులకు సన్నకారు టెన్షన్
వరంగల్, జూన్ 8
సన్నరకం వరిని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులు వ్యతిరేకిస్తున్నారు. పెట్టుబడికి తోడు నీటి పారకం అధికంగా అవసరమైన ఈ పంటపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పంటకాలం ఆరుమాసాలు కావడం, చీడపీడల బెడద అధికంగా ఉండటంతో ప్రధానంగా సన్న, చిన్నకారు రైతాంగానికి తీవ్ర నష్టం ఏర్పడే అవకాశాలున్నాయి. బోర్లు, బావులపైనే ఆధారపడిన రైతులైతే వరి పంటను పూర్తిగా వదిలేసి ఇతర పంటలవైపు మొగ్గుచూపుతున్నారు. నియంత్రిత సాగువిధానంతో భూస్వాములకు నష్టం లేకపోయినా ఎకరం, రెండెకరాల భూమిపై ఆధారపడుతున్న వారిని మరింత కష్టాల్లోకి నెట్టే పరిస్థితి నెలకొంది. కొన్ని జిల్లాల్లో నేలస్వభావానికి అనుగుణంగా సాగుచేసుకుంటున్న అన్నదాతలు ప్రభుత్వం విధించిన షరతులతో అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా సన్నరకం వరిపైనే రైతు సదస్సుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిశీలిస్తే.. 5లక్షలా50వేల మంది రైతులుంటే 4లక్షలా 60వేల మందికిపైగా సన్న చిన్నకారు రైతులు. 19లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా ఏటా ఖరీఫ్‌లో 13లక్షల నుంచి 14లక్షలు, రబీలో 9 నుంచి 10లక్షల ఎకరాలు సాగవుతున్నది. అందులో వరి సాగు నాలుగున్నర లక్షల ఎకరాలు. పూర్వ వరంగల్ జిల్లాలో 3లక్షల 20వేలకుపైగా వ్యవసాయ బావులు, బోర్లు ఉన్నాయి. 3లక్షల5వేల574 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. కరువు ప్రాంతమైన జనగామ జిల్లాలో 43వేల బోర్లు, 42వేల బావులున్నాయి. లక్షా 52వేల మంది రైతులు ఉన్నారు. పూర్తిగా బోర్లు, బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇటీవల గోదావరి జలాలతో చెరువులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా పూర్తిగా నింపడం లేదు. ఉమ్మడి జిల్లాలో 6714 చెరువులు, కుంటలు ఉండగా 4లక్షలా16వేలా663 ఎకరాల సాగు భూమి ఉంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రెండున్నర లక్షలు కూడా సాగవడం లేదు. దీంతో బోర్లు, బావులపైనే ఆధారపడిన రైతులు సన్న రకాలు సాగు చేయడం కష్టతరంగా మారింది.సన్న రకం ధాన్యాన్ని 60శాతం పెంచాలని ప్రభుత్వం ఆదేశించినా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 30 నుంచి 35శాతమే దిగుబడి చేస్తున్నారు. సన్నసాగును పెంచడానికి చాలాప్రాంతాల్లో ఆసక్తి చూపడం లేదు. జనగామ మండలం మరిగడి గ్రామంలో 2360 ఎకరాల భూమిలో 1350 ఎకరాలు సాగుభూమి. 800 మంది రైతులు. 1170 ఎకరాలు ప్రతియేటా సాగవుతుంది. అందులో 320 ఎకరాలు వరి వేస్తారు. వందెకరాలు మాత్రమే సన్నవి, మిగతా మొత్తం దొడ్డురకం. గ్రామ రైతులకు నీటి వసతి లేక బోర్లు, బావులపైనే ఆధారపడి పంటల్ని దిగుబడి చేస్తున్నారు. దేవాదుల కాల్వ పక్కనే ఉన్నది. దాన్నుంచే చిటకోడూరు రిజర్వాయర్ నింపి జనగామ పట్టణానికి తాగునీరు ఇస్తారు. కానీ మరిగడి చెరువులు నింపడం లేదు. గ్రామ పరిసరాల్లో రాళ్లు, గుట్టలు అధికంగా ఉండటంతో నీటి లభ్యతా తక్కువే. అందువల్ల ఇంటి వాడకానికి సరిపడా సన్నవి వేసి మిగతావి దొడ్డురకం సాగు చేస్తున్నారు.సన్నరకం సాగు పంటకాలం ఆరు మాసాలు. నీటి వసతి అధికంగా ఉండాలి. దోమ, అగ్గితెగులు, కాండ తొలివడం వంటి రోగాలకు ఈ పంట తట్టుకోలేదు. దొడ్డు రకాలతో పోలీస్తే రెండింతల నీరు అధికంగా తీసుకుంటుంది. రోహిణి కార్తెలోనే నారు పోసి 30 రోజులు మించకుండానే నాటు వేయాలి. పంట దిగుబడి 20 క్వింటాళ్లు మించదు. దొడ్డురకం నీటి ఎద్దటి తట్టుకుంటుంది. రోగ నిరోధక శక్తి అధికం. పంట దిగుబడి 30 నుంచి 32 క్వింటాళ్లు వస్తుంది. ప్రభుత్వం ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా, బీపీటీ రకాలు మాత్రమే అధికారికంగా ప్రకటించింది. వీటి దిగుబడి కూడా తక్కువ. సన్నరకాల్లో కొంత దిగుబడి పెరిగే శ్రీ ఆమన్, ఆమన్, హెచ్‌ఎంటి, అక్షర తదితర రకాలను గుర్తించలేదు. దిగుబడి చేసినా సన్నరకం కొంటామని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకపోవడంతో రైతులు వ్యతిరేకిస్తున్నారు.