15రోజుల్లో 9 ఆపరేషన్లు
శ్రీనగర్, జూన్ 8,
జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేతకు సైన్యం చేపట్టిన ఆపరేషన్ సోమవారం ఉదయం ముగిసింది. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో 9 మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చినట్టు దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. గత రెండు వారాల్లో తొమ్మిది భారీ ఆపరేషన్‌లు చేపట్టి, 22 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని ఆయన తెలిపారు.వీరిలో హిజ్బుల్, లష్కరే తొయిబా, జైషే మొహముద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఆరుగురు టాప్ కమాండోలు ఉన్నారని వివరించారు. ఆదివారం, సోమవారం జరిగిన రెండు ఎన్‌కౌంటర్‌లలో 9 మంది హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నారు.ఆదివారం రెబాన్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురు హతమయ్యారని తెలిపారు. సోమవారం ఉదయం పింజోరాలో మరో నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్టు వివరించారు. జమ్మూ కశ్మీర్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకూ నిర్వహించిన ఆపరేషన్‌లలో ఇదే అతిపెద్దదని ఉద్ఘాటించారు.షోపియాన్ జిల్లాలోని రెబాన్ వద్ద ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఆదివారం (జూన్ 7) ఉదయం నుంచి భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. షోపియాన్ జిల్లాలోని రెబాన్ ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో సీఆర్‌ఫీఎఫ్ జవాన్లు, ఆర్మీ అధికారులతో పాటు జమ్ము కశ్మీర్ పోలీసులు పాల్గొన్నారు.