భారీగా ట్రాఫిక్ పెనాల్టీలు
హైద్రాబాద్, జూన్ 8,
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాకిస్తున్నారు. బైక్‌కు సైడ్ మిర్రర్స్, బ్యాక్ సీట్లో కూర్చునే పిలియన్ రైడర్‌కు కూడా హెల్మెట్ తప్పనిసరి అనే నిబంధన తీసుకొచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. లైసెన్స్ లేకుండా బండి డ్రైవ్ చేస్తున్న వారికి షాకిస్తున్నారు. లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ పట్టుబడితే.. వాహనాన్ని స్వాధీనం చేసుకొని మరుసటి రోజు కోర్టులో హాజరుపరుస్తున్నారు. వాహనదారుడిపై ఛార్జిషీట్ దాఖలు చేస్తారు. రోజంతా కోర్టు ప్రాంగణంలోనే అతడు నిలబడి ఉండటంతోపాటు.. జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.ఇంత చేసిన తర్వాత కూడా లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ రెండోసారి చిక్కితే 48 గంటలపాటు జైల్లో ఉంచుతారు. మూడోసారి కూడా చిక్కితే ఎక్కువ రోజు జైల్లో ఉండటంతోపాటు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఐదు లేదా అంత కంటే ఎక్కువసార్లు ఇలాగే చేస్తే.. వారం రోజుల్లో జైల్లో ఉండక తప్పదు. పోలీసుల నివేదిక ఆధారంగా కోర్టులు జరిమానా విధిస్తాయి.ఇంతకు ముందు లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన వారికి పోలీసులే జరిమానా విధించేవారు. కానీ గత కొన్నాళ్లుగా వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 5 వేలకుపైగా వితవుట్ డ్రైవింగ్ లైసెన్స్ కేసులు నమోదు చేశారు. 425 మైనర్ డ్రైవింగ్ కేసులు కూడా నమోదయ్యాయి.లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ పట్టుబడిన వారు.. మరుసటి రోజు ఉదయం ధ్రువపత్రాలు, ఫొటోలు తీసుకుని కోర్టు ముందు హాజరు కావాలి. ఇలా చేయడం వల్ల స్నేహితులు, బంధువుల వాహనాలను తీసుకొని రొడ్డెక్కి యాక్సిడెంట్లు చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయొచ్చని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.