YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం విదేశీయం

 రాజస్థాన్ లో డిఫెన్స్ ఉద్యోగుల అరెస్ట్

 రాజస్థాన్ లో డిఫెన్స్ ఉద్యోగుల అరెస్ట్

 రాజస్థాన్ లో డిఫెన్స్ ఉద్యోగుల అరెస్ట్
జైపూర్, జూన్ 9
సైనిక రహస్యాలను పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకి చేరవేస్తున్న రక్షణ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులను రాజస్థాన్‌ పోలీసులు  అరెస్టు చేశారు. వీరిని పట్టుకోవడానికి మిలటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ) ఆధ్వర్యంలో ఏడాది నుంచి ఆపరేషన్‌ కొనసాగింది. నిందితులను వికాస్‌ కుమార్‌ (29), చిమన్‌ లాల్‌ (29)గా గుర్తించారు. వికాస్‌.. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో సైనిక ఆయుధ డిపోలో పనిచేస్తుండగా.. బికనేర్‌లోని ఆర్మీ మహాజన్‌ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌ (ఎంఎఫ్‌ఎఫ్‌ఆర్‌)లో చిమన్‌లాల్ కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. పాకిస్థాన్‌ సరిహద్దుల వెంబడి ఉన్న ఈ రెండు స్థావరాలు.. భారత్ సైన్యానికి వ్యూహాత్మకంగా చాలా కీలకమైనవి.సైనిక రహస్యాలను శత్రువులకు చేరవేస్తున్న ఇంటి దొంగల పని పట్టడానికి ఎంఐలోని లక్నో విభాగం, ఉత్తర్‌ప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్ స్క్యాడ్ (ఏటీఎస్‌) ‘డెజర్ట్‌ చేజ్‌’ పేరిట గత ఏడాది ఆగస్టులో ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. అనోష్క చోప్రా అనే నకిలీ పేరుతో పాక్‌ గూఢచారి ఒకరు ఫేస్‌బుక్ ద్వారా వికాస్‌కు గాలం వేసినట్లు అధికారులు గుర్తించారు. ఆమెను పాకిస్థాన్‌లోని ముల్తాన్‌కు చెందిన యువతిగా నిర్ధరించారు. బికనేర్‌లో సైన్యం, ఆయుధ సామగ్రి, విన్యాసాలు, కవాతుల కోసం అక్కడికి వస్తున్న సైనిక విభాగాల వివరాలు, ట్యాంకులు, ఇతర వాహనాల ఫొటోలను పాకిస్థాన్‌కు వికాస్ చేరవేస్తున్నట్లు తేలింది.దీనికి ప్రతిఫలంగా అతడికి నగదు అందుతోందని, సోదరుల బ్యాంకు ఖాతాల ద్వారా ఆ సొమ్మును పొందినట్టు దర్యాప్తులో గుర్తించారు. చిమన్‌లాల్‌ ద్వారా ఎంఎఫ్‌ఎఫ్‌ఆర్‌లో నీటి పంపిణీ రిజిస్టర్‌కు సంబంధించిన ఫొటోలను వికాస్‌ సేకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సైనిక రహస్యాలను చేరవేసినందుకు ప్రతిఫలంగా ఇప్పటి వరకూ రూ.75 వేల పొందినట్టు దర్యాప్తులో తేల్చారు.దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఈ కేసు దర్యాప్తులో పురోగతి ఆగిపోయింది.. అయితే, వీరిద్దరి కారణంగా సున్నితమైన సమాచారం శత్రువులకు చిక్కుతుండటంతో మే తొలివారంలో రాజస్థాన్‌కు కేసును బదిలీ చేశారు. రాజస్థాన్ పోలీస్ ఇంటెలిజెన్స్, లక్నో మిలటరీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఓ టీమ్‌ను ఏర్పాటుచేశారు. సంయుక్త బృందం దర్యాప్తు చేపట్టి, గుట్టురట్టు చేసింది. వికాస్‌ను సోమవారం అదుపులోకి తీసుకుని విచారణ కోసం జయపూర్‌కి తరలించారు.తనకు అనోష్క చోప్రా పేరుతో గతేడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందని తెలిపాడు. తర్వాత తమ మధ్య స్నేహం పెరిగి, వాట్సాప్ నెంబర్లు షేర్ చేసుకున్నట్టు వెల్లడించాడు. ఆమె ముంబయిలోని క్యాంటీన్ స్టోర్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నట్టు చెప్పిందని వివరించాడు. ఆమె అడిగినట్టు వికాస్ కుమార్ అనేక వాట్సాప్ గ్రూపులలో యాడ్ చేసినట్టు తేలింది. ఇరువురి మధ్య చివరిసారిగా జూన్ 7న సంభాషణ జరిగిందన్నారు.

Related Posts