YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ దేశీయం

మిజోరాం తరహాలో హైద్రాబాద్ లో మరోసారి లాక్ డౌన్

మిజోరాం తరహాలో హైద్రాబాద్ లో మరోసారి లాక్ డౌన్

మిజోరాం తరహాలో హైద్రాబాద్ లో మరోసారి లాక్ డౌన్
హైద్రాబాద్, జూన్ 9
హైదరాబాద్ లో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తూనే వుంది. ఎప్పుడు ఎన్ని కేసులు నమోదవుతాయో తెలీని పరిస్థితి.  పరిస్థితి ఇంత తీవ్రంగా వున్నా జనంలో మాత్రం సీరియస్ నెస్ కనిపించడం లేదు. లాక్ డౌన్ ఓపెన్ చేయగానే జనం రోడ్ల మీద పడ్డారు. కరోనా అనేది ఒకటుందనే విషయాన్నే మరచిపోయి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. హైదరాబాదులో నిన్న ఆదివారం ఒక్కరోజే రోడ్ల మీదకు వచ్చిన జనం సంఖ్య లక్షల్లో వుంటుందని ఒక అంచనా.. గట్లు తెగిన నీటి ప్రవాహంలా రోడ్ల మీదకు వస్తున్న జనాన్ని చూసి డాక్టర్లు ఆందోళనకు గురవుతున్నారు.ఇలా అయితే చాలా వేగంగా కరోనా వ్యాపించడం ఖాయం అని డాక్టర్లు అంటున్నారు. హైదరాబాదు రామ్ నగర్ ఫిష్ మార్కెట్లో చేపలు కొనడానికి జనం వేలంవెర్రిగా రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి చూస్తే ఇంకెన్ని కేసులు బయటపడతాయోననే భయం పెరుగుతోంది. హైదరాబాద్‌లో మరోమారు కఠినమయిన లాక్ డౌన్ విధించే దిశగా ప్రభుత్వం యోచిస్తోందా అనిపిస్తోంది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడమన్నది ఇప్పుడు  ప్రభుత్వాలకు పెద్ద సవాల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకూ కేసులు ఇంకా ఇంకా పెరుగుతూనే వస్తున్నాయి. కేసులు మరింతగా పెరిగే అవకాశముందని ప్రభుత్వం కూడా భావిస్తోంది. కేసులు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించింది. హైదరాబాద్ విషయంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకునే దిశగా యోచిస్తున్నట్లుగా ప్రభుత్వవర్గాల నుంచి సమాచారం. కరోనా కట్టడి కోసం హైదరాబాద్‌లో నిబంధనలు కఠినతరం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని నాల్గో అంతస్తులోని ఓ సెక్షన్‌లో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ అంతస్తులోని ఉద్యోగులను ఇళ్లకు పంపి.. శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. బల్దియా కార్యాలయంలో దాదాపు 1500 మంది పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,650 కేసులు నమోదు కాగా, ఇందులో 137 మంది మరణించారు. 1,742 మంది చికిత్స ద్వారా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 1,771 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో మరణాల సంఖ్య కూడా పెరగడం మరింత గుబులు రేపుతోంది. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ఓ హోటల్ లో ఆయన చాయ్ తాగారు. అయితే ఆ హోటల్ లో టీ మాస్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో వైద్యులు బొంతు రామ్మోహన్ కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఫలితం నెగటివ్ రావడంతో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీయార్ అధికారులతో సమావేశం అయి కీలక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.  నాలుగైదు రోజుల పాటు హైదరాబాద్‌ను షట్‌డౌన్ చేసే దిశగా ఆయన భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. 

Related Posts