YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రంగులు..పూసి మారేడుకాయలు చేసి

రంగులు..పూసి మారేడుకాయలు చేసి

రంగులు..పూసి మారేడుకాయలు చేసి
విజయవాడ, జూన్  9,
ఇదేదో సినిమాలో చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా మేమే అని బాలయ్య ఒక భారీ డైలాగు కొడతాడు. అలాగే ప్రభుత్వ ఆఫీసులకు రంగులు వేయాలన్నా హంగులు, ఆర్భాటాలు చేయాలన్నా కూడా అది పసుపు పార్టీ టీడీపీకే చెల్లింది. ఎందుకంటే ఏం చేసినా మసి పూసి మారేడు కాయ చేసే రాజకీయ గండరగండ చంద్రబాబు టీడీపీకి అధినాయకుడు. మరి చంద్రబాబుని చూసి మేమూ అలాగే చేస్తామనుకుంటే దేశ అత్యున్నత న్యాయస్థానంలోనే మొట్టికాయలు పడతాయి. ఏకంగా ప్రజల సొమ్ము నాలుగు వేల కోట్లు హారతి కర్పూరం అవుతాయి. వైసీపీకి ఇది గుణపాఠం కావాలని ఏకంగా బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు హితవు చెబుతున్నారు. టీడీపీ హాయాంలో ఇంత రచ్చ కాలేదు కాబట్టి కోర్టుల దాకా కధ నడవలేదు అని వీర్రాజు అంటున్నారు.పసుపు రంగును టీడీపీ పెట్టిన ఎన్టీఆర్ శుభానికి గుర్తు అనేవారు. అంతా శుభంగా సౌఖ్యంగా ఉండాలని ఆ రంగు ఎంచుకున్నట్లుగా కూడా ఆయన చెప్పేవారు. అటువంటి పసుపు రంగును ఏకంగా శ్మశానానికి పూత పూయాలని చంద్రబాబు జమానాలో తమ్ముళ్ళకు అనిపించినపుడే వారి రంగుల వెర్రి గతి తప్పిందని అంతా అర్ధం చేసుకున్నారు. నాడు ఆఫీసులు, అన్నా క్యాంటీన్లూ అవీ ఇవీ తేడా లేకుండా టీడీపీ రంగులే పూత పూశారు. ఎన్టీఆర్ బొమ్మ ఓవైపు, చంద్రబాబు బొమ్మ మరో వైపు పెట్టి దర్జా చేశారు. అయితే నాడు ఇంత చేసినపుడు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి దీని మీద కోర్టులకు వెళ్ళి ఇది రాజ్యాంగబధ్ధం కాదు అని పోరాడాలనిపించలేదు. దాంతో టీడీపీ చేసిందే నాడు రాజ్యాంగం అయిపోయింది.మరి టీడీపీ చేసింది కాబట్టి మేమూ చేస్తామని వైసీపీ నేతలు పంతానికి పోయారు. అత్తెసేరు మెజారిటీ వచ్చిన టీడీపీకె అంత రంగుల మోజు ఉంటే మాకెంత ఉండాలని గొప్పలకు పోయారు. అది చిలికి చిలికి ఇపుడు పార్టీ పరువు మొత్తం తీసింది. ఆ రంగులనీ కలసి వైసీపీ నెత్తిన పడి గలీజ్ చేసిపారేశాయి. ఇపుడు కడుక్కోవాల్సిన పెద్ద బాధ్యత కూడా పార్టీ మీద, ప్రభుత్వం మీద పడింది. నిజానికి ఈ చర్య రాజ్యాంగ వ్యతిరేకమని అందరికీ తెలుసు. కానీ ఎవరూ నాడు అది చెప్పలేదు. కోర్టులకు ఎక్కలేదు. కాబట్టి కధ సాఫీగా సాగింది. దేశంలో చాలా రాష్ట్రాలూ మరీ ఏపీలా దారుణంగా శ్మశానాల వరకూ కాకపోయినా తమకు గట్టి ముద్ర ఉండాలనుకునే చోట పార్టీ రంగులు అద్దుతున్నారు. కానీ ఏపీలోనే పిచ్చి ముదిరి రంగు రాజకీయం పాకాన పడి కోర్టుల చేత సర్కార్ చీవాట్లు పడుతోంది.ఇపుడు టీడీపీ నేతలు అదే అంటున్నారు. మేము చేశామని చేస్తే చూశారా మీ కధ ఎక్కడ కట్టించాలో అక్కడే కట్టిస్తామని కూడా సవాల్ చేస్తున్నారు. తాము నెగ్గామని కూడా చెప్పుకుంటున్నారు. నిజానికి గత టీడీపీకి కూడా కోర్టులు వేసిన మొట్టికాయలుగా దీన్ని భావించాలి. మరోవైపు వైసీపీ ఇలాంటి వాటి విషయంలో నాడు విపక్షంగానూ, నేడు అధికారపక్షంగానూ చేతకానితనంతో చేతులెత్తేసి టీడీపీ ముందు బేలగా నిలబడడం పార్టీ అభిమానులకు నిజంగా బాధ కలిగించే అంశమే అంటున్నారు. ఇకనైనా టీడీపీ బాటలో తప్పుడు విషయాల్లో నడవకుండా ప్రజల కోసం మేలు చేస్తూ అది గట్టిగా చెప్పుకుంటే పార్టీకి అదే పదివేలు అంటున్నారు వైసీపీ హితైషులు.

Related Posts