వైసీపీలో ఇసుక రగడ
నెల్లూరు, జూన్ 9,
అధికార పార్టీ వైసీపీలో ఇసుక సునామీ రేగుతోందా ? నేతల మధ్య ఇసుక ప్రధానాస్త్రంగా మారుతోందా ? ప‌్రతిపక్షాలు చేయాల్సిన రగడను సొంత పార్టీలోనే నేతలు సృష్టిస్తున్నారా ? ప్రభుత్వానికి ఈ పరిణామం తీవ్ర తలనొప్పిగా పరిణమించిందా? అంటే.. తాజాగా గడిచిన పదిహేను రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు. ఆదిలో నెల్లూరులో మొదలైన ఇసుక తుఫాను.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవరించే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. నిజానికి రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.. ఇసుకపైనే.అప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక పేరిట.. చేసిన లావేదేవీల కారణంగా తీవ్ర అవినీతి జరిగిందని, తమ్ముళ్లు భారీ ఎత్తున ప్రజలను దోచుకున్నారని చెప్పిన వైసీపీ నేతలు.. రీచ్‌లను ప్రభుత్వం పరిధిలోకి తీసుకువచ్చారు. ఆన్‌లైన్‌లోనే బుకింగ్ చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. ఈ క్ర మంలో నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చేందుకు కొంత సమయం కూడా తీసుకున్నారు. ఈ సమయంలోనే భారీ ఎత్తున వర్షాలు, వరదలు రావడంతో ఇసుక కొట్టుకుపోయి.. తీవ్ర దుమారం రేగింది. పనులు లేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ.. ప్రతిపక్షం ఊరూవాడా రగడ చేసింది.టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా విజయవాడ వేదికగా ఇసుక నిరాహారదీక్ష కూడా చేశారు. ఈ క్రమంలో నే ఎట్టకేలకు నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చిన జగన్ ప్రభుత్వం అంతటా పారదర్శకతకు పెద్దపీట వేయడంతోపాటు.. ఇసుక పంపిణీ వ్యవస్థ మొత్తాన్నీ కలెక్టర్లకు అప్పగించారు. అదేసమయంలో అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీలకు సూచించారు. ఇంత వరకు సీఎం పరిధిలో అన్నీ సక్రమంగా నే సాగాయి. అయితే, మంత్రుల జోక్యం పెరిగిపోవడం, జిల్లాలపై ఆధిపత్యం ప్రదర్శించడంతో ఇసుక రాజకీయంగా మారిపోయింది. నెల్లూరులో ప్రసన్నకుమార్ రెడ్డి నుంచి ప్రస్తుతం గుంటూరులో వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వరకు కూడా గళం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది.ఇటీవలే.. ఇసుకను ఆన్‌లైన్ చేయడంతోపాటు.. దీనిని పూర్తిగా గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించాలనే నిర్ణయంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే.. ప్రభుత్వం ఏర్పడి.. ఏడాది పూర్తయినా.. తమకు ఆర్ధికంగా వనరులు కల్పించకపోవడం, అభివృద్ధి పనులు చేపట్టకపోవడం కూడా ఇసుకపై ఆరోపణలు వచ్చేలా నేతలు వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా యేడాది కాలంలో ఏపీలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలకు నిధులు అందడం లేదన్నది వాస్తవం. జగన్ ఎక్కువగా సంక్షేమంపై దృష్టి పెడుతూ ప్రజలను నమ్ముకున్నట్టే కనపడుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు అడిగిన పనులు లేదా.. సిఫార్సులకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో పాటు వారికి ఆదాయం లేకపోవడం కూడా వారిలో ఈ అసమ్మతికి కారణంగా కనిపిస్తోంది. ఈ మొత్తాన్ని సరిచేసేందుకు తక్షణమే ఇసుక విషయాన్ని చక్కదిద్దాలనేది కీలక నేతల సూచన. మరి జగన్ ఏం చేస్తారో ? చూడాలి