ద్వదశార్యా సూర్య స్తుతి
ఓం శ్రీ సూర్యాయనమః
1. ఉద్వన్నద్య వివశ్వాన్ -
ఆరోహన్నుత్తరాం దివం
హృద్రోగం మమ సూర్యో -
హరిమాణం చాశు నాశయతు
నేడు ఉదయిస్తూ, ఉన్నత స్థానమైన దివాన్ని (రోజును) ఎక్కుతున్న ప్రకాశస్వరూపుడైన శ్రీ సూర్య భగవానుడు, నా హృదయ వ్యాధినీ, బయటకు కనపడని మానసిక రుగ్మతలను, ఆంతరంగిక, బాహ్య రోగములను శీఘ్రముగ నశింపచేయాలని ప్రార్థిస్తున్నాను.
2. నిమిషార్ధేనేకైన
ద్వే చ శతే ద్వే సహస్రే ద్వే!
క్రమమాణ! యోజనానాం
నమోస్తుతే నళిననాథాయ
ఒక రెప్పపాటు కాలంలోని సగం కాలంలోనే, రెండువేల రెండు వందల యోజనాల దూరం పయనించే, పద్మములకు నాథుడవైన, ఓ సూర్యదేవా! నీకు నమస్కారము.
3 కర్మ-జ్ఞాన-ఖ-దశకం
మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ!
ద్వాదశధా యో విచరతి
స ద్వాదశమూర్తిరస్తు మోదాయ!
కర్మేంద్రియములు ఐదు, జ్ఞానేంద్రియములు ఐదు (మొత్తం 10), మనస్సు, జీవుడు అనబడే పన్నెండు రూపములతో విశ్వసృష్టి నిర్వహణకై సంచరించే ఆదిత్యుడు, మాకు ఆనందమును తృప్తిని కలిగించు గాక!
4. త్వం హి యజూ ఋక్ సామః
త్వమాగమస్త్వం వషట్కారః!
త్వం విశ్వం త్వం హంసః
త్వం భానో! పరమహంసశ్చ
ఓ సూర్యదేవా! ఋగ్వేద, సామవేద, యజుర్వేదములు, మంత్రశాస్త్రములు, వషట్కారము (యజ్ఞ స్వరూపము), సర్వ విశ్వము, హంస (ప్రాణస్వరూపం), పరమహంస (పరబ్రహ్మ) నీవే.
5. శివరూపాత్ జ్ఞానమహం!
త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్!
శిఖిరూపాదైశ్వర్యం!
త్వత్తశ్చారోగ్యమిఛ్ఛామి!
శివరూపంతో నున్న నీ నుండి జ్ఞానాన్నీ, విష్ణురూపమైన నీ వలన ముక్తిని, అగ్ని స్వరూపుడవైన నీచే ఐశ్వర్యాన్ని, సూర్యరూపమైన నీ నుండి ఆరోగ్యాన్నీ అర్ధిస్తున్నాను.
6. త్వచి దోషా దృశి దోషాః!
హృది దోషా యే ఖిలేంద్రియజదోషాః!
తాన్ పూషా హతదోషః!
కించిద్ రోషాగ్నినా దహతు.
పూషా (పోషకుడు) అయిన సూర్యుడు, తన ప్రతాపాన్ని కాసింత చూపించి, మా చర్మ దోషాలను, కంటి రుగ్మతలను, హృదయ వ్యాధులను, సకల ఇంద్రియాలలోని దోషాలను దహించు గాక!
7. ధర్మార్ధకామమోక్ష -
ప్రతిరోధా నుగ్రతాపవేగ కరాన్!
బందీకృతేంద్రియగణాన్
గదాన్ విఖండయతు చండాంశుః!
ధర్మార్ధకామమోక్ష సాధనలకు ఆటంకంగా ఉన్నవీ, తీవ్రతాపాన్ని కలిగించేవీ, ఇంద్రియ శక్తులను బంధించేవీ అయున వ్యాధులను ఖండించి, తీవ్రకాంతి కిరణాలు కలిగిన సూర్యుడు (చండాంశువు) మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక!
8. యేన వినేదం తిమిరం!
జగదేత్య గ్రసతి చరమచరమఖిలం!
ధృతబోధం తం నళినీభ -
ర్తారం హర్తారమాపదామీడే.
పద్మములకు పతియైన ఏ సూర్యుడు లేనట్లైతే, గాఢమైన అంధకారం వ్యాపించి, ఈ స్థావర జంగమాత్మక జగతిని మింగివేస్తుందో, ఆ రవి, పద్మాలను వికసింపచేసినట్లే మాకు నూతన వెలుగుతో జ్ఞానప్రకాశాన్నీ, స్ఫూర్తిని కలిగించుగాక! - అనుచు, ఆపదలను తొలగించే ఆదిత్య భగవానుని ప్రార్ధిస్తున్నాను.
9 యస్య సహస్రాభీశో -
రభీశులేశో హిమాంశుబింబగతః!
భాసయతి నక్తమఖిలం
భేదయతు విపద్గణానరుణః!
సహస్ర కిరణములు ఉన్న ఏ సూర్యకాంతిలేశం చంద్రునిలో చేరి, రాత్రిని ప్రకాశింపచేస్తున్నదో, ఆ అరుణుడు మా ఆపదలన్నిటినీ నశింపజేయు గాక!
10 తిమిరమివ నేత్ర తిమిరం
పటలమివా శేషరోగ పటలం నః!
కాశమివాధినికాయం
కాలపితా రోగయుక్తతాం హరతాత్!
కాలమునకు కర్త అయిన భాస్కరుడు, చీకటిని నశింపచేసినట్లే, నా కంటిపొరను, - తన వేడిమితో రెల్లును తగలబెట్టినట్లు మా మనోవేదనల సమూహాన్ని, మొత్తంగా మా రోగ స్థితులను పోగొట్టు గాక!
11 వాతాశ్మరీగదార్శస్ -
త్వగ్దోషమహోదరప్రమేహాంశ్చ!
గ్రహణీభగందరాఖ్యా
మహతీస్త్వం మే రుజో హంసి!
ఆదిత్య దేవా! వాతవ్యాధినీ, అశ్మరీ వ్యాధినీ (మూత్రపిండాలలో రాళ్ళు చేరే వ్యాధి), మూల వ్యాధినీ, చర్మవ్యాధుల్నీ, మహోదరాన్నీ, ప్రమేహాన్నీ, గృహణినీ, భగందరాన్నీ ఇలా అన్ని పెద్ద వ్యాధుల్నీ నశింపజేయుమా!
12 త్వం మాతా త్వం శరణం
త్వం ధాతా త్వం ధనం త్వమాచార్యః!
త్వం త్రాతా, త్వం హర్తా -
విపదమార్క! ప్రసీద మమ భానో!
అర్కా! (పూజ్యా!), మాకు నీవే తల్లివి, నీవే ఆశ్రయమైన వాడవు, నీవే పోషకుడవు, నీవే ధనము, నీవే ఆచార్యుడవు, నీవే రక్షకుడవు, ఆపదలను హరించు వాడవు అయిన ఓ భానూ! మమ్ము అనుగ్రహింపుము.
ఇత్యార్యాద్వాదశకం - సాంబస్య
పురో నభః స్థలాత్పతితం!
పఠతాం భాగ్యసమృధ్ధిః -
సమస్తరోగక్షయశ్చ స్యాత్
ఈ పన్నెండు శ్లోకములు 'అర్యా' ఛందస్సులో రచింపబడినవి. శ్రీకృష్ణుని పుత్రుడైన సాంబుని ముందు సూర్యానుగ్రహం వలన ఆకాశము నుండి పడిన శ్లోకాలివి.
వీటిని చదివే వారికి సూర్యకృపచే, భాగ్యముల పెంపు, రోగాల నాశనం సిధ్ధిస్తాయి.
ఓం శ్రీ సూర్యాయనమః
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో