టెన్త్ గ్రేడింగ్ ఇలా
హైద్రాబాద్, జూన్ 9,
దో తరగతి విద్యార్థులను పరీక్షల్లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో పరీక్షల్లేకుండానే.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఈ ఏడాది టెన్త్ విద్యార్థులంతా పాస్ కానున్నారు. అయితే గ్రేడింగ్ ఎలా కేటాయిస్తారు అనే విషయంలోనే విద్యార్థులందరికీ సందేహాలున్నాయి.
91-100 మార్కులు వస్తే వారికి ఏ-1 గ్రేడ్, 10 జీపీఏ కేటాయిస్తారు.
81-90 మార్కులు వస్తే వారికి ఏ-2 గ్రేడ్, 9 జీపీఏ కేటాయిస్తారు.
71-80 మార్కులు వస్తే వారికి బీ-1 గ్రేడ్, 8 జీపీఏ కేటాయిస్తారు.
61-70 మార్కులు వస్తే వారికి బీ-2 గ్రేడ్, 7 జీపీఏ కేటాయిస్తారు.
51-60 మార్కులు వస్తే వారికి సీ-1 గ్రేడ్, 6 జీపీఏ కేటాయిస్తారు.
41-50 మార్కులు వస్తే వారికి సీ-2 గ్రేడ్, 5 జీపీఏ కేటాయిస్తారు.
తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. పరీక్షల్లేకుండానే ప్రమోట్
2014 నుంచి రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమల్లో ఉంది. దీని ప్రకారం.. 9, 10 తరగతుల్లో త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక పరీక్షల విధానాన్ని తొలగించి నిర్మాణాత్మక మూల్యాంకనం (ఫార్మెటివ్ అసెస్‌మెంట్–ఎఫ్‌ఏ), సంగ్రహణాత్మక మూల్యాంకనం (సమ్మెటివ్ అసెస్‌మెంట్–ఎస్‌ఏ) విధానం కొనసాగుతోంది. ఈ విధానం ప్రకారం ఒక్కో విద్యార్థికి ఆ విద్యా సంవత్సరంలో నాలుగు ఎఫ్‌ఏలు, రెండు ఎస్‌ఏలు జరిగేవి.
2015 నుంచి ఇంటర్నల్ విధానం:
2015లో టైన్త్ క్లాస్ వార్షిక పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం 20 మార్కులు ఇంటర్నల్స్, 80 మార్కులకు రాత పరీక్షకు కేటాయించారు. ఈ ఇంటర్నల్స్‌లో ఒక్కో ఎఫ్‌ఏకు ప్రతి సబ్జెక్టులో 20 మార్కుల చొప్పున నాలుగు ఎఫ్‌ఏలు ఉంటాయి.తర్వాత ప్రతి సబ్జెక్టుకు కేటాయించిన 20 ఎఫ్‌ఏ మార్కులను ఆయా స్కూల్స్ ప్రతి సబ్జెక్టులో 5 మార్కులకు కుదిస్తాయి. ఇలా కుదించిన అనంతరం నాలుగు ఎఫ్‌ఏల్లో కలిపి ఒక్కో దానికి 5 మార్కుల చొప్పున 20 అవుతాయి. ప్రతి సబ్జెక్టులో అలా వచ్చిన 20 మార్కులను విద్యార్థుల ఇంటర్నల్ మార్కులుగా పరిగణించి పదో తరగతి పరీక్షల విభాగానికి పంపుతాయి.అయితే ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి 2019 జూలై, ఆగస్టు, నవంబర్, 2020 జనవరి నెలల్లో ఎఫ్‌ఏలను నిర్వహించారు. ఈ ఎఫ్‌ఏల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్నల్ మార్కులను ఆయా స్కూళ్లు పరీక్షల విభాగానికి పంపాయి.
గ్రేడ్‌లు, జీపీఏలు ఎలా కేటాయిస్తారంటే..?
ఒక్కో విద్యార్థికి ప్రతి సబ్జెక్టలో ఉన్న 20 ఇంటర్నల్ మార్కులను 100 మార్కులుగా పరిగణిస్తారు. ఈ 20 మార్కుల్లో విద్యార్థులకు ఎంత శాతం మార్కులు వచ్చాయో వాటి పర్సంటేజీ ప్రకారం జీపీఏలను కేటాయిస్తారు.ఉదాహరణకు ఒక విద్యార్థికి సైన్స్‌లో ఇంటర్నల్ మార్కులు 20కి 20 వచ్చి ఉంటే అతనికి 100కి 100 మార్కలు వచ్చినట్లు లెక్క. అప్పుడు ఆ విద్యార్థికి ఆ సబ్జెక్టులో ఏ–1 గ్రేడ్ (10 జీపీఏ ) వస్తుంది. అలాగే అదే విద్యార్థికి మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో కూడా ఏ–1 గ్రేడ్ వస్తే.. 10/10 జీపీఏ వస్తుంది.ఒకవేళ ఆ విద్యార్థికి ఇంటర్నల్స్‌లో ఒక్కో సబ్జెక్టులో 18 మార్కులే వస్తే అతనికి 90 మార్కులు వచ్చినట్లు పరగిణిస్తారు. ఈ మార్కుల ప్రకారం ఆ సబ్జెక్టులో ఆ విద్యార్థికి ఏ–2 గ్రేడ్‌తో 9 పాయింట్ జీపీఏ వస్తుంది. అలా మిగిలిన సబ్జెక్టుల్లో కూడా వచ్చే జీపీఏ లను బట్టి యావరేజ్ మార్కుల పర్సంటేజీ ఆధారంగా గ్రేడ్లు, జీపీఏలను కేటాయిస్తారు. అయితే ఈ విషయాలన్నింటిపైన త్వరలో అధికారికంగా ఒక స్పష్టత రానుంది.