YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పర్యావరణ సుస్థిరతపై సదస్సు

పర్యావరణ సుస్థిరతపై సదస్సు

సహజమైన అడవిని కాపాడుతూ, పర్యావరణ మార్పుల హానికారకాలను వీలైనంత తగ్గించేలా కొత్త జాతీయ అటవీ విధానం ఉండాలని తెలంగాణ అటవీ శాఖ అభిప్రాయపడింది. త్వరలో రానున్న జాతీయ అటవీ విధానం ముసాయిదా ప్రతిపాదనలపై చర్చించి, తగిన సలహాలు, సూచనలు కేంద్రానికి పంపేందుకు అరణ్య భవన్ లో వర్క్ షాప్ జరిగింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ పంపిన ముసాయిదా ప్రతిపాదనలపై భాగస్వామ్య శాఖలు, అడవులపై అధ్యయనం చేసే సంస్థలు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, పారిశ్రామిక రంగం ప్రతినిధులు వర్క్ షాప్ లో పాల్గొన్నారు. సహజ అడవి, పునరుజ్జీవన చర్యలను కొనసాగిస్తూనే, పర్యావరణ సుస్థిరతకు హాని చేస్తున్న కర్బన ఉద్గారాలను తగ్గించేలా కొత్త జాతీయ అటవీ విధానం ఉండాలని వర్క్ షాప్ అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం నాలుగో జాతీయ అటవీ విధానం తెచ్చేందుకు ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. గతంలో 1988లో వచ్చిన అటవీ విధానం ఇప్పటిదాకా అమలవుతోంది. అంతకు ముందు 1894, 1952లో జాతీయ స్థాయిలో అటవీ విధానాలను అప్పటి ప్రభుత్వాలు తెచ్చాయి. అయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పర్యావరణ పరంగా వస్తున్న మార్పులను తట్టుకుని, అటవీ సంపదను కాపాడుకునేలా కొత్త విధానంపై కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని రాష్టాలకు ముసాయిదా పంపిన కేంద్రం, ఆయా అటవీ శాఖల నుంచి ఈ నెల 14 లోగా నివేదికలను కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీ.కే.ఝా నేతృత్వంలో వర్క్ షాప్ జరిగింది. కేంద్ర ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చతో పాటు, భాగస్వామ్య పక్షాల సలహాలు, సూచనలను ఈ సమావేశంలో నమోదు చేశారు. పర్యావరణం కాపాడుకోవటం, మానవాళి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖల పరిధిలో వెల్లడయ్యే ఉద్గారాలను అంచనావేయటం, వాటి తగ్గింపుకు తగిన చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో మంత్రుల కమిటీలను నియమించటంతో పాటు, కొత్తగా కార్బన్ ఎకౌంటింగ్ సెల్ ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సమావేశం స్వాగతించింది. దీనివల్ల పర్యావరణపై అన్ని స్థాయిల్లో జవాబుదారీతనం పెరుగుతుందనే అభిప్రాయలు వెల్లడయ్యాయి. ఇక క్షీణించిన అడవులు, ఉపయోగకరంగా లేని అటవీ ప్రాంతాలను ప్రైవేట్ సంస్థలకు పీపీపీ విధానంలో లీజుకు ఇచ్చే ప్రతిపాదనలపై లోతుగా చర్చ జరిగింది. పర్యావరణహిత ప్రాజెక్టులు చేపట్టేలా కఠినమైన నిబంధనలతో ఈ విధానం అమలు చేయవచ్చని, అదే సమయంలో స్థానిక వన సంరక్షణ సమితి, గ్రామసభల అనుమతిని తప్పనిసరి చేయాలనే సూచనలు వచ్చాయి. స్థానికంగా ఉండే జీవవైవిధ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా తగిన పర్యవేక్షణతోనే ఈ అనుమతులు ఉండాలన్నారు. అడవులు, వాటిపై ఆధారపడే పరిశ్రమలకు అనుసంధానం మరింత పెరగాలని, ముడి సరుకుల ఉత్పత్తినే పెంచే గ్రీన్ జాబ్స్ రానున్న రోజుల్లో పెరగాలనే చర్చ సమావేశంలో జరిగింది. ఇక జాతీయ అటవీ విధానంలో భాగస్వామ్యంగా ఉండే ప్రభుత్వ శాఖలను తమ పరిధిలోకి వచ్చే అంశాలను వర్క్ షాపులో చర్చించాయి. పట్టణ సుందరీకరణ, చెట్ల పెంపకానికి ప్రాధాన్యత పెరిగిందని, కానీ పట్టణ స్థానిక సంస్థలకు నిధుల కొరత ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పనులకు ఉపాధి హామీ అనుసంధానం ఉందనీ, కానీ పట్టణ ప్రాంతాల్లో అలా లేకపోవటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కొత్త అటవీ విధానంలో ఈ సమస్యకు పరిష్కారం ఉండాలని పురపాలక శాఖ డైరెక్టర్ టీ.కే. శ్రీదేవి అభిప్రాయపడ్డారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం పశు సంపదను వృద్ధి చేసే చర్యలను తీసుకుంటోందని, దీనికి అనుగుణంగా గ్రాసం పెంపులేదని, ముసాయిదా విధానంలో ఈ అంశాన్ని పేర్కొనలేదని పశు సంవర్థక శాఖ డైరెక్టర్ డి. వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకం కింద అటవీ భూములను సాగు చేస్తున్న రైతులకు లబ్దిపై కూడా స్పష్టత అటవీ విధానంలో రావాలని వ్యవసాయ శాఖ కోరింది. అటవీ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని, ఆ ఉత్పత్తుల దిగుబడులను పెంచే చర్యలతో పాటు నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించే చర్యలు ఉండాలని, తద్వారా ఉత్పత్తుల వాడకం పెరుగుతుందన్నారు. ఈ చర్యల వల్ల పర్యావరణ హానికారక ఉత్పత్తుల వాడకం తగ్గుతుందనే సమావేశంలో పాల్గొన్న స్వచ్చంద సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. ఆగ్రో, ఫామ్ ఫారెస్ట్రీ కింద పంటలు పండించే రైతులు లాభసాటిగా ఉత్పత్తి సాధించే చర్యలకు తోడు, వారిని జాతీయ పంటల భీమా పథకం పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనలను అందరూ స్వాగతించారు. ఇక పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉంటే ఫారెస్ట్ బ్లాక్ లను అభివృద్ది చేయటం, వాటిని స్థానిక ప్రజలకు అవసరమైన లంగ్ స్పేస్ లుగా( స్వచ్చమైన గాలిని ఇచ్చే ప్రాంతాలుగా) మార్చే ప్రక్రియ అటవీ శాఖ పర్యవేక్షణలోనే జరగాలనే సూచనలు వచ్చాయి. అటవీ సంరక్షణ, వాటిపై ఆధారపడి జీవించేవారి నైపుణ్య శిక్షణ పెరిగేలా చర్యలు తీసుకోవాలనే పలువురు సూచించారు. అలాగే వృత్తి పరంగా అటవీ అధ్యయనాన్ని ప్రోత్సహించటం, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులపై విసృత స్థాయి అధ్యయనానికి వీలుగా కేంద్ర అటవీ విధానం ఉండాలని, అటవీ శాఖలకు నిధుల పరిమితిని, సరళతరం చేసి కేంద్రం నుంచి నిధుల పెరిగేలా చర్యలు ఉండాలన్నారు. వర్క్ షాపులో అటవీ శాఖ ఉన్నతాధికారులు ఎం.పృధ్వీరాజ్, కె.రఘువీర్, అదనపు అటవీ సంరక్షణ అధికారులతో పాటు, వివిధ భాగస్వామ్య శాఖల అధికారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ , టాస్క్, ఐ.టీ.సీ, ఈపీటీఆర్ఐ, ఎఫ్.డీ.సీ, ఆస్కీ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ కోట తిరుపతయ్య వర్క్ షాప్ సమన్యయకర్తగా వ్యవహరించారు.

Related Posts