YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పేదలు, రైతుల సమస్యలపై రాజీలేని పోరాటం 

పేదలు, రైతుల సమస్యలపై రాజీలేని పోరాటం 

పేదలు, రైతుల సమస్యలపై రాజీలేని పోరాటం 
ఆన్ లైన్ భేటిలో చంద్రబాబు
అమరావతి జూన్ 9 
తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ఇన్ ఛార్జ్ లతో పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఆన్ లైన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ ఏడాది వైసిపి పాలనలో రైతులు, పేదల సమస్యలు అన్నీఇన్నీ కావు. అనేక పథకాలను రద్దు చేశారు, ఎన్నో ఆంక్షలు పెట్టారు, భారీగా కోతలు విధించారు.  స్కీమ్ ల పేరుతో స్కామ్ లకు పాల్పడ్డారు. చివరికి కరోనా కిట్లలో, బ్లీచింగ్ లో కూడా అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వీటన్నింటిని చర్చకు తీసుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి ఆయా వర్గాల సమస్యలు పరిష్కరించేలా రాజీలేని పోరాటం చేయాలి.  పార్టీకి  ద్రోహం చేసిన వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి, పార్టీ ద్రోహులు చరిత్ర హీనులుగా మిగిలి పోతారు. పార్టీకి ద్రోహం చేసిన వారెవరినీ ప్రజలు ఆదరించరని, ద్రోహులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని’’ చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.వైసిపి ఏడాది విధ్వంస పాలనపై టిడిపి ఛార్జిషీట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నవ రత్నాల ముసుగులో వైసిపి చేసిన నవ మోసాలు, నవ రద్దులు, నవ కోతలు, నవ భారాలు, నవ విధ్వంసాలను ఎండగట్టాలి. కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే వైసిపి నాయకులు పండుగలు, సంబరాలు జరుపుకోవడం హేయం. మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు విందులు, వినోదాల్లో మునిగితేలడం అనాగరికం. వైసిపి విందులు-సంబరాలపై జాతీయ మీడియా అనేకమార్లు విమర్శలు గుప్పించినా వాళ్ల పోకడల్లో మార్పులేక పోవడం శోచనీయమని అయన అన్నారు. సీఎం సొంత కంపెనీకి మేళ్లు సిగ్గుచేటు: ముఖ్యమంత్రి సొంత కంపెనీకి ఆయనే లీజు పొడిగించుకోవడం, ఆయనే నీళ్లు కేటాయించుకోవడం మున్నెన్నడూ లేదు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా జరగలేదు, ఏ ముఖ్యమంత్రి ఇటువంటి దుర్మార్గానికి తెగించలేదు. దాచేపల్లి సరస్వతి పవర్ ఇండస్ట్రీకి 50ఏళ్ల లీజు పొడిగింపు సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. మొన్న ఆయనే 0.7టిఎంసిల కృష్ణా నీళ్లు తన కంపెనీకి కేటాయించుకున్నారు. ఇప్పుడు ఏకంగా మైనింగ్ లీజు 50ఏళ్లకు పొడిగించుకున్నారు. అడిగేవాళ్లు లేరని ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. సొంత కంపెనీకి మేళ్లు చేసుకోవడం సిగ్గుచేటు. మీ సొంత వ్యాపారాల అభివృద్ది కోసమేనా ఒక్క ఛాన్స్ అడిగింది ప్రజలను..ఛాన్స్ దొరికిందని యధేచ్చగా దోపిడి చేస్తారా..?   జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పోకడలకు ప్రజలే గుణపాఠం చెప్పాలి. రాష్ట్రంలో గనులన్నీ వైసిపి నాయకులే కబ్జా చేశారు.  విశాఖ ఏజెన్సీలో లేటరైట్ గనులపై తాజాగా కన్నేశారు. మొత్తం మైనింగ్ వీళ్ల స్వాధీనం చేసుకున్నారు. ఇతరులపై తప్పుడు కేసులు, జరిమానాలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. టిడిపి సానుభూతి పరుల ఆర్ధిక మూలాలు దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు. కాపు రామచంద్రారెడ్డి సహా ఇతర వైసిపి నాయకుల మైనింగ్ కంపెనీలపై వేసిన జరిమానాలను రద్దు చేశారని అయన అన్నారు. టిడిపి సానుభూతిపరులనే సాకుతో మెడికల్ కాలేజిల యాజమాన్యాలను కూడా వేధిస్తున్నారు.   లిక్కర్, ల్యాండ్, శాండ్, హవుసింగ్, మైనింగ్ లలో వైసిపి చేయని అరాచకం లేదు. అవినీతి కుంభకోణాలకు అంతే లేకుండా పోయింది.  ముడుపుల కోసమే సిమెంట్ ధరలు పెంచేశారు. సిమెంట్ బస్తాపై కమిషన్, లిక్కర్ సీసాపై కమిషన్, గనులపై కమిషన్...రాష్ట్రాన్నితమ కమిషన్ల అడ్డాగా మార్చారు. పర్సంటేజిలు ఇవ్వకపోతే బిల్లులు చేయడం లేదు.   ఇళ్ల స్థలాల స్కామ్ పై టిడిపి నిజ నిర్ధారణ కమిటి నివేదిక: బలవంతపు భూసేకరణతో నష్టపోయిన వారిలో 90% దళితులు, బలహీన వర్గాల వాళ్లే. బిసి,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల నుంచి 3,190ఎకరాలు బలవంతంగా లాక్కున్నారు,  12,300 బీసి, ఎస్సీ,ఎస్టీ మైనారిటీల భూములు లాక్కున్నారు. పేదలకు టిడిపి ప్రభుత్వం ఇచ్చిన 5,721ఇళ్ల పట్టాలు రద్దు చేశారు. భూసేకరణ పేరుతో రూ 1600కోట్లు  వైసిపి నాయకులే స్వాహా చేశారు . తణుకు పట్టణంలోనే వైసిపి నాయకులు రూ14కోట్లు స్వాహా చేశారని మంత్రి బంధువే  సీఎం జగన్ కు లేఖ రాశారు.  గుడివాడలో రూ70కోట్ల విలువైన భూమి కబ్జా చేశారు. ఆవ భూముల సేకరణకు రూ 250కోట్లు, మెరక చేయడానికి రూ 150కోట్ల స్కామ్ చేశారు. ఏ నియోజకవర్గం చూసినా ల్యాండ్ స్కామ్ లు వందల కోట్లలోనేనని అయన అన్నారు. ఇళ్ల స్థలాలకు భూసేకరణలో, లెవలింగ్ లో భారీ అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారు. అనేక చోట్ల వైసిపి ఎమ్మెల్యేల భూములనే అధిక రేట్లకు ప్రభుత్వంతో కొనిపించి సొమ్ము చేసుకున్నారని టిడిపి నిజనిర్ధారణ కమిటి వెల్లడించింది.  టిడిపిపై అక్కసుతో నరేగా బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారు.  నాణ్యంగా చేసిన పనులను కూడా, నాసిరకంగా చేసినట్లు తప్పుడు నివేదికలు ఇవ్వాలని అధికారులను వేధిస్తున్నారు. ఇప్పుడు పంచాయితీరాజ్ ఇంజనీర్లను బలి చేయాలని చూస్తున్నారు. నరేగా సిబ్బంది, ఇంజనీర్లు రోడ్డెక్కి ఆందోళనలు చేసే దుస్థితి తెచ్చారు. గ్రామాల్లో చేసిన నరేగా పనులపై డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లు ఉన్నాయి. ఎఫ్ టివోలు ఉన్నాయి. సోషల్ ఆడిట్ జరిగింది. చేసిన పనులు కళ్లెదుటే ఉన్నాయి. ఇన్నిమార్లు కోర్టులు తీర్పులు ఇచ్చాయి, కేంద్రం అనేకమార్లు హెచ్చరించింది. ఎన్ని వాతలు పెట్టినా అతనిలో మార్పులేదు.  పేదల సంక్షేమానికి వైసిపి చేసింది స్వల్పం. చెప్పుకునేది అధికం. కోతలు, ఆంక్షలతో లబ్దిదారులను మూడింట రెండు వంతులు తగ్గించారు.  ప్రతిరోజూ యాడ్స్ ఇస్తున్నారు.  విద్యుత్ బిల్లులు పెంచేసి పేదల జీవితాలను దుర్భరం చేశారు. రూ 200వచ్చే నెల బిల్లు, రూ2వేలు రావడం చూసి సామాన్యుల గగ్గోలు  పెడుతున్నారని అయన అన్నారు.   కరెంటు ఛార్జీలు పెంచేది లేదని, పైగా తగ్గిస్తామని ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారు. కరెంటు బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలి. ఇళ్లలోనే ఉంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయాలి. ఆర్టీసి ఛార్జీలు పెంచి రూ 2వేల కోట్ల భారం మోపారు. ఇసుక-సిమెంట్ ధరలు, మద్యం ధరలు పెంచి ఆర్ధికంగా కుంగదీశారు. ఏడాదిలో ఇన్ని భారాలు మోపిన ప్రభుత్వాన్ని చూడలేదు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి.  ఏడాదిలో 600మంది రైతుల ఆత్మహత్యలు. కర్నూలు జిల్లాలోనే లాక్ డౌన్ పీరియడ్ లో 14మంది రైతుల ఆత్మహత్యలు. చేతికి అందివచ్చిన పంట అమ్ముకోలేక, అప్పులు తీర్చలేక, ప్రభుత్వం నుంచి ఆదుకునేవారు లేక,  మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గుంటూరు జిల్లాలో రైతులకు 40రోజులుగా డబ్బులు చెల్లించలేదు. రూ 26కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. 30లక్షల టన్నుల పంట ఉత్పత్తుల నిల్వలు రైతుల వద్దే ఉన్నాయి. ధాన్యం, శనగ, మొక్కజొన్న, పసుపు, ఉల్లి, పత్తి, మిర్చి రైతులు తీవ్ర నష్టాల్లో మునిగారు. సిపి ఏడాది పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ధ్వజమెత్తాలని అయన అన్నారు.  భేటిలో టిడిపి ప్రజాప్రతినిధులు, ఇన్ ఛార్జ్ లు, సీనియర్ నాయకులు, వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. 

Related Posts