టాలీవుడ్ కు సర్కార్ రెడ్ కార్పెట్
విజయవాడ, జూన్ 10,
జగన్ రాజకీయం బాగానే నేర్చారు అంటున్నారు. ఆయన పదెళ్ళుగా తిన్న ఎదురుదెబ్బలతో రాటుదేలిపోయారు కూడా అని చెబుతున్నారు. ఇక జగన్ కి మరో అదృష్టం ఏంటి అంటే ఆయన ప్రత్యర్ధిగా రాజకీయాలను మొత్తం ఔపాసన పట్టిన చంద్రబాబు ఉండడం. చంద్రబాబు అలా ఉండడం వల్ల జగన్ కి అన్ని పట్లూ తెలిసిపోతున్నాయి. తిరిగి వాటిని తనదైన శైలిలో మార్చి తిప్పికొడుతూంటే గుక్కపట్టి ఏడవడం తప్ప విపక్షం ఏంచేయలేకపోతుంది. ఇక తాజాగా తీసుకుంటే జగన్ టాలీవుడ్ భారీ చీలిక తెస్తున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు చంద్రబాబుకు, ఇటు పవన్ కళ్యాణ్ కి కూసాలు కదిలిపోయేలా టాలీవుడ్ కే ఆపరేషన్ అకర్ష్ మంత్రం గట్టిగా వినిపిస్తున్నారుజగన్ సీఎం అయ్యాక టాలీవుడ్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా అభినందించిన పాపాన పోలేదు. దానిమీద థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ప్రుధ్వీ అప్పట్లో చేసిన కామెంట్స్ కూడా వివాదం అయ్యాయి. జగన్ కి కనీసం మర్యాదగానైనా కలవలేరా?అంటూ టాలీవుడ్ పెద్దలను ప్రుధ్వీ దెప్పిపొడిచారు. అయితే దానికి ఇపుడు తగిన సమయం, సందర్భం వచ్చింది. జగన్ మొదట మెగాస్టార్ నుంచే కధ నడుపుకుని రావడంతో ఇపుడు టాలీవుడ్ పూర్తిగా వైసీపీ వైపుగా కదులుతోంది. చిరంజీవిని తన ఇంటికి పిలిచి మరీ విందు ఏర్పాటు చేసిన జగన్ శభాష్ అనిపించుకున్నారు. దాంతో ఫిదా అయిపోయిన చిరంజీవి జగన్ కి జై అనేశారు.మరో వైపు చూసుకుటే టాలీవుడ్ లో మరో పెద్ద సినిమా కుటుంబం ఉంది. అదే ఘట్టమనేని కుటుంబం. దానికి ప్రస్తుత వారసుడు మహేష్ బాబు ఉన్నారు. ఆయన సైతం జగన్ కి జై కొడుతున్నారు. ఆయన సొంత బావ గుంటూరు ఎంపీగా టీడీపీ తరఫున గల్లా జయదేవ్ ఉన్నా కూడా మహేష్ జగన్ కే మద్దతు అంటున్నారు. ఆ మధ్యన తన సతీమణి నమ్రతను పంపించి జగన్ సతీమణి భారతి ద్వారా కృష్ణ సొంత ఊరు బుర్రిపాలేం అభివృధ్ధికి నిధులను మహేష్ కోరారు. దానికి జగన్ ఎస్ అంటూ వెంటనే నిధులు మంజూరు చేశారు. ఆ తరువాత మహేష్ కొత్త సినిమాలకు అదనపు ఆటలకు కూడా జగన్ ఉదారంగా అనుమతులు ఇచ్చి మంచి చేసుకున్నారు. దీనికి తోడు ఏపీకి టాలీవుడ్ తరలివస్తే అన్ని రకాల సాయం చేస్తానని జగన్ చెప్పిన మాటకు మహేష్ స్వాగతం అంటూ పూర్తి మద్దతు ప్రకటించారఇక కృష్ణ సోదరుడు, సీనియర్ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కూడా మళ్ళీ వైసీపీలో చేరబోతున్నారని టాక్. ఆయన గతంలో కాంగ్రెస్ లో ఉండేవారు, ఆ తరువాత వైఎస్ కుమారుడు జగన్ వైపు వచ్చి వైసీపీలో కీలకమైన పాత్ర పోషించారు. అయితే ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. కానీ టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. ఆ తరువాత విజయనిర్మల మరణంతో కృష్ణను పరామర్శించేందుకు వచ్చిన సీఎం జగన్ తో మాట కలిపి మళ్ళీ ఆదిశేషగిరిరావు సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆయన వైసీపీ ఎంపీ, జగన్ కి సన్నిహితుడు విజయసాయిరెడ్డితో సమావేశం అయ్యారు. దాంతో ఆయన వైసీపీలో చేరడం లాంఛనం అని తేలిపోయిందటాలీవుడ్ లో తాజా పరిణామాలు చంద్రబాబు పవన్ లకు దెబ్బగా ఉన్నాయని అంటున్నారు. ఏకంగా సొంత అన్న చిరంజీవి జగన్ ని పొగడడం, ఆయనతో వరస భేటీలు వేయడం జనసేన మీద పొలిటికల్ గా తీవ్ర ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. పవన్ సినీనటుడు, రాజకీయ నేతగా ద్విపాత్రాభియం చేస్తున్నారు. దాంతో ఆయనకు ఇపుడు ఏదీ బయటకు మాట్లాడలేని ఇరకాటంగా ఉందని అంటున్నారు. అలాగే బాబు బావమరిది సినీ నటుడు బాలకృష్ణకు కూడా ఇది ఇబ్బందికరమే. ఆయన మొత్తం సినిమా పరిశ్రమ ఒకవైపు ఉంటే తాను ఒంటరిగా ఉండాల్సివస్తోంది. మొత్తం మీద చూసుకుంటే జగన్ ఇలా టాలీవుడ్ ని లాగేసి రెండు పార్టీల రాజకీయానికి కూడా గట్టి షాక్ ఇచ్చారని అంటున్నారు.