YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

రెచ్చిపోతున్న కాల్ మనీ వ్యాపారులు

రెచ్చిపోతున్న కాల్ మనీ వ్యాపారులు

 రెచ్చిపోతున్న కాల్ మనీ వ్యాపారులు
తిరుపతి, జూన్ 10, 
కరోనా సమయం.. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం.. చిరు జీతంపై ఆధారపడిన బడుగు జీవనం.. వేతనంలో కోత పడిన మధ్యతరగతి కుటుంబం.. లాక్‌డౌన్‌ వేళ పొట్టపోసుకునేందుకే కష్టపడుతున్న తరుణంలో అప్పులు కట్టలేక అవస్థలు పడుతున్నారు. కాల్‌మనీ, ఫైనాన్స్, చిట్‌ఫండ్‌ కంపెనీల తాకిడికి బెంబేలెత్తుతున్నారు. కేంద్రప్రభుత్వం కల్పించిన వెసులుబాటును సైతం లెక్క చేయకపోవడంతో బేజారవుతున్నారు. ప్రైవేటు వడ్డీవ్యాపారుల దందాకు ఆందోళన చెందుతున్నారు. కాళ్లావేళ్లా పడుతున్నా కనికరించకపోవడంతో పలువురు ఉసురుతీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు వడ్డీవ్యాపారులు, ఫైనాన్స్, చిట్‌ఫండ్‌ కంపెనీలు, అనధికార చీటీ నిర్వాహకులు, వెహికల్‌ ఫైనాన్స్‌ వాళ్లు దిగువ, మధ్యతరగతి ప్రజలను జలగల్లా పీడిస్తున్నారు. లాక్‌డౌన్‌తో పనులు లేక కుటుంబ పోషణకే అవస్థలు పడుతుంటే  అప్పులు కట్టాల్సిందే అని బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాదంటే భయపెట్టి మరీ ప్రామిసరీ నోట్లు రాయించుకుంటున్నారు. అవకాశముంటే ఖాళీ చెక్కులు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో బ్యాంకులు సైతం మారటోరియం అమలు చేస్తున్నా ప్రైవేట్‌ దందా మాత్రం యథేచ్ఛగా సాగిపోతోంది. మార్చి 24 లాక్‌డౌన్‌విధించినప్పటి నుంచి జిల్లాలో సుమారు 10మంది వరకు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జిల్లాలో సుమారు 4వేల డైలీ ఫైనాన్స్‌ కంపెనీలు ఉన్నాయి. తిరుపతి నగరంలో భారీగా తండల్‌ వ్యాపారాలు సాగుతుంటాయి. మదనపల్లి, పలమనేరు, శ్రీకాళహస్తి, పీలేరు,పుంగనూరు, చిత్తూరు ప్రాంతాల్లో అధికారిక, అనధికారిక వడ్డీ వ్యాపారులు అధిక సంఖ్యలో ఉ న్నారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో తమిళనాడు, విజయవాడకు చెందిన డైలీ, వీక్లీ ఫైనాన్స్‌ వ్యాపారులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. మొత్తం మీద జిల్లావ్యాప్తంగా సుమా రు రూ.20కోట్ల వరకు  ఫైనాన్స్‌ వ్యాపా రం సాగుత్నునట్టు అంచనా. ఇక అనధికారిక చీ టీల విషయానికి వస్తే రూ.కోట్లలోనే లావాదేవీలు జరుగుతుంటాయి. అప్పులు తీసుకున్న వారిలో చాలామంది లాక్‌డౌన్‌ ఎ ఫెక్ట్‌ వల్ల వాయిదాలు చెల్లించని పరిస్థితి. అయి నా వడ్డీ వ్యాపారులు ఏ మాత్రం కనికరించడంలేదు.  జిల్లాలో ఎక్కువమంది మధ్యతరగతికి చెందిన వారు టూవీలర్లు, ఆటోలు, కొందరు లారీలు, బాడుగకు తిప్పేందుకు కార్ల కోసం ఫైనాన్స్‌ తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. దీంతో కంపెనీవాళ్లు నిర్మొహమాటంగా వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. రెండు నెలలకు పైగా సక్రమంగా పనులు లేక ఇంటికే పరిమితమైన బడుగుజీవులను ఫైనాన్స్ వ్యాపారులు తీవ్రంగా వేధిస్తున్నారు. శ్రీకాళహస్తికి చెందిన డోలు వాయిద్యకారుడు వెంకటరమణ అప్పులవాళ్ల  వేధింపులు తాళలేక 5 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. పలమనేరు నియోజకవర్గంలో 3రోజుల క్రితం అప్పు కట్టలేక ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.తిరుపతిలో ప్రైవేటు ఉద్యోగి అయిన ఓ మహిళ రెండు నెలలుగా ఫైనాన్స్‌ చెల్లించలేదని ఆమె వాహనాన్ని లాకెళ్లారు. ఆమె తన భర్తతో కలసి సదరు ఫైనాన్స్‌కంపెనీకి వెళితే వారు అవమానించి పంపినట్లు తెలిసింది. పలమనేరు పట్టణంలోని పాతపేటలో చిన్న దుకాణం నడుపుకుంటున్న ఒక మహిళ జనవరిలో తమిళనాడు వ్యాపారుల నుంచి రూ.10వేల అప్పు తీసుకుంది. లాక్‌డౌన్‌ వరకు రోజూ ఫైనాన్స్‌ చెల్లించింది. ఆపై దుకాణం మూతపడడంతో కట్టలేకపోయింది, దీంతో ఆమెను బెదిరించి మరీ ప్రామిసరీ నోటు రాయించుకు వెళ్లినట్లు సమాచారం. పలమనేరు సాయినగర్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి రూ.లక్ష చీటీ పాడుకున్నాడు. ప్రస్తుతం నెల వాయిదా చెల్లించలేకపోవడంతో ఆయనపై దౌర్జన్యం చేసి మరీ చీటీ నిర్వాహకుడు ఇంటి స్థలం రాయించుకున్నాడు.ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నా అప్పు చేసిన పాపానికి అవమానాలు దిగమింగుకుంటున్నారేగాని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారు.

Related Posts