కొత్త రెవెన్యూ చట్టంలో యాజమాన్య పత్రాలు
హైద్రాబాద్, జూన్ 10,
శాస్త్రీయంగా భూ వినియోగం జరిగేలా కొత్త రెవెన్యూ చట్టంలో కీలక సంస్కరణలను ప్రభుత్వం తీసుకురానుంది. ఈ కేటగిరిలోనే కొత్త చట్టం అమలుకు ముందే నిషేధిత భూముల నోటిఫికేషన్ సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ దిశలోనే ని షేధిత భూముల జాబితాను అధికారులు ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించారు. 24 లక్షల ఎకరాల నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని నివాస ప్రాంతాలు, వివాదాలు లేని, అటవీ భూములు, అసైన్డ్, ప్రభుత్వ భూముల జాబితా ((సెక్షన్ 22ఏ)ను రూపకల్పన చేసి గెజిట్ నోటిఫికేషన్ జారీ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.అసైన్డ్ భూముల జాబితాను ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమిత భూములను తి రిగి స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం చట్ట సవరణ చేయనున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో అన్నిరకాల ప్రభుత్వ భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.84 లక్షల ఎకరాల చెరువులు, కుంటలు, కాలువలు, రైల్వేలైన్, సబ్‌స్టేషన్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఇతర ప్రభుత్వ ఆస్తుల కింద వినియోగంలో ఉన్నాయి. భూ యజమానులకు ఇప్పటివరకు ఆస్తులు, భూములపై యాజమాన్య హక్కు (టైటిల్) లభించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా రూపొందిస్తున్న రెవెన్యూ చట్టంలో యాజమాన్య హక్కు పత్రాలు ఇచ్చే దిశగా చర్చ జరుగుతోంది.భూ రికార్డుల ఆన్‌లైన్ వెబ్‌సైట్ సమగ్ర పథకాలతో సంపూర్ణస్థాయిలో సిద్ధమవుతోంది. అదేవిధంగా వ్యవసాయ భూములకు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యవసాయ రికార్డు మేనేజ్‌మెంట్ సిస్టం (టిఎస్‌ఏఆర్‌ఎంఎస్)ను రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తం భూముల వివరాలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపర్చి బ్యాంకులు, రెవెన్యూ శాఖ ఇతర సంస్థలకు లాగిన్ సౌకర్యం కల్పిస్తారు. తనఖా, పంట సాయం, ఇన్‌ఫుట్ సబ్సిడీ, పంటనష్టం, ఇన్యూరెన్స్, విత్తనాల పంపిణీ, ఉచిత విద్యుత్, ఇతర అంశాలను ప్రభుత్వం నేరుగా తెలుసుకొని పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుంది. సిఎం కెసిఆర్ త్వరలో రైతులకు ప్రకటించనున్న కొత్త పథకానికి ఈ వివరాలే కీలకం కానున్నాయి.మొత్తం భూ విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో 112.08 లక్షల హెక్టార్లు కాగా ఎపిలో 162.97 లక్షల హెక్టార్లుగా ఉంది. ఇందులో నికరసాగు ఎపిలో 60 లక్షల హెక్టార్లు కాగా, తెలంగాణలో 41 లక్షల హెక్టార్లుగా నమోదయ్యింది. ఎపిలో అడవులు 36 లక్షల హెక్టార్లు, తెలంగాణలో 25 లక్షల హెక్టార్లు ఉండగా వ్యవసాయేతర అవసరాలకు ఎపిలో 20 లక్షల హెక్టార్లు, తెలంగాణలో 8 లక్షల హెక్టార్లు, సాగు చేయలేని భూమి తెలంగాణలో 6 లక్షల హెక్టార్లు, ఎపిలో 13 లక్షల హెక్టార్లుగా ఉంది. సాగుకు అనువుగా ఉన్నప్పటికీ సాగుకు వినియోగించని భూమి తెలంగాణలో 1.83 లక్షల హెక్టార్లు, ఎపిలో 4.14 లక్షల హెక్టార్లుగా ఉంది.సాగుకు పనికిరాని భూమి రాష్ట్రంలో 24 లక్షల హెక్టార్లు, ఎపిలో 23 లక్షల హెక్టార్లుగా ఉందని తేలింది. అయితే ఎక్కడ కూడా ఏ భూమికి దేనికి వినియోగించాలనే విధానపరమైన విధి, విధానాలు అమల్లో లేవు. లక్షలాది ఎకరాలు వ్యవసాయేతర అవసరాలకు మళ్లుతోంది. ప్రభుత్వం సేకరించి సిద్ధం చేసిన రికార్డుల్లో రాష్ట్రంలో 1,12,077 చదరపు కిలోమీటర్ల వివరాలు ఖాతాల వారీగా నిక్షిప్తమయ్యాయి. 2.80 లక్షల ఎకరాల భూ భాగంలో 1.42 కోట్ల ఎకరాల వివాదరహిత వ్యవసాయ భూమి, 17.89 లక్షల ఎకరాల భూమి వివిధ న్యాయపరమైన వివాదాల్లో ఉందని సమాచారం. మరో 11.95 లక్షల ఎకరాల భూమి రైతుల వద్ద ఉన్నా అది సేద్యానికి పనికిరాదని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.