భారం..భారం..ఆన్ లైన్ భారం
హైద్రాబాద్, జూన్ 10
లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందుల్లో పేద, మధ్యతరగతి వర్గాలకు ఆన్‌లైన్ విద్య భారంగా మారుతోంది. పాఠశాల స్థాయి నుంచి మొదలుకుని ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి వృత్తి కోర్సుల వరకు మొత్తం ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తుండటంతో తల్లిదండ్రులు పిల్లల కోసం సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కొనాలంటే రూ.8 వేలకు పైగానే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇద్దరు పిల్లలున్న వారికి రెట్టింపు ఖర్చు. వీడియోల కోసం అదనంగా బ్లూటూత్ స్పీకర్లు కొంటున్నారు. వీటితోపాటు డాటా రీఛార్జ్ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సగటున ఒక విద్యార్థి ఆన్‌లైన్ చదువు కోసం నెలకు రూ.300 వరకు డేటాకు ఖర్చు చేస్తున్నారు.ఫైబర్ కేబుల్ ఉన్నవారికి నెలకు రూ.500 వరకు వ్యయమవుతోంది. కొన్ని కళాశాలలు ఆన్‌లైన్ తరగతులకు ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ప్రైవేటు విద్యార్థులు 40 లక్షల వరకు ఉన్నారు. వీరిలో కనీసం 25 శాతం మంది అంటే 10 లక్షల మంది కొత్తగా ఫోన్లు, ట్యాబ్‌లు కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వేరే మార్గం లేక ఇఎంఐలు పెట్టుకుని లేదా అప్పులు చేసైనా పిల్లలకు ఫోన్లు, ట్యాబ్‌లు కొనుగోలు చేస్తున్నారు.రాష్ట్రంలో ఆగస్టు తర్వాతనే పాఠశాలలు తెరిచే అవకాశం ఉన్నందున అప్పటి వరకు డిజిటల్ బోధన కొనసాగనుంది. అప్పటి వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు వచ్చే విద్యా సంవత్సరం పాఠాలను ఇప్పటి నుంచే ఆన్‌లైన్‌లో బోధిస్తున్నాయి. రోజుకు 2 నుంచి 4 గంటలపాటు తరగతులు నిర్వహిస్తున్నాయి. వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసి, హోంవర్క్‌తోపాటు సందేహాలు నివృత్తి చేస్తున్నారు. పిల్లలు ఆన్‌లైన్ పాఠాలు వింటున్నారా, హోం వర్క్ చేస్తున్నారా అని తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. ఉన్నత విద్యలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) సూచన మేరకు 25 శాతం పాఠ్యాంశాలను ఆన్‌లైన్‌లోనే బోధించేందుకు ప్రణాళిక రూపొందించారు. సగం మందికి కళాశాలలో నేరుగా, మిగతావారికి డిజిటల్ బోధన సాగనుంది.