రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా అందులో విద్యార్థుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పడుతోంది. ఓవైపు ప్రభుత్వం రెసిడెన్షియల్ పద్ధతిలో ఏర్పాటు చేసిన గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు విద్యార్థులను ఆకర్షిస్తుండటంతో జిల్లాలో మిగిలిన పాఠశాలలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న తీరు ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. అయితే జననాల రేటు తగ్గుముఖం పడుతుండటం ఒక వంతు కారణమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో జిల్లా విద్యా సమాచారం(యుడైస్) ద్వారా జిల్లా విద్యాశాఖ సేకరించిన గణంకాల ప్రకారం విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని వెల్లడవుతోంది. జిల్లా విద్యాశాఖ యుడైస్ గణాంకాల ప్రకారం గతేడాది జిల్లాలో ప్రభుత్వ, స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో మొత్తం పాఠశాలలు 649 ఉండగా, ఈ విద్యా సంవత్సరంలో వాటి సంఖ్య 661కి పెరిగింది. అలాగే ప్రైవేటు పాఠశాలలు గతేడాది 306 ఉండగా, ఈ సారి వాటి సంఖ్య 329కి చేరింది. ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు 11 ఉండగా, ఈసారి కొత్తగా ఇల్లందకుంట మండలంలో 1 కేజీబీవీని ప్రారంభించారు. పాఠశాలలు పుట్టుకొస్తున్నా వాటిల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 6,946 మంది విద్యార్థులు తగ్గుముఖం పట్టారు. గతేడాది వీటిల్లో చదివిన వారు 1,39,480 ఉండగా, ఈసారి వారి సంఖ్య 1,32,534కు చేరింది. ప్రైవేటు పాఠశాలల్లో గత విద్యా సంవత్సరం 85,524 మంది విద్యార్థులుండగా, ప్రస్తుతం 82,450 మంది చదువుతున్నారు. వీటిల్లో 3074 మంది తగ్గారు. ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో గతేడాది 2,824 మంది విద్యార్థులుండగా, ప్రస్తుతం వారి సంఖ్య 2,208కి చేరింది. 616 మంది విద్యార్థులు తగ్గారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు బడుల్లో విద్యార్థుల ప్రవేశాలు తగ్గుతున్నాయి. పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు నిలకడగానే ఉన్నా.. పల్లెల్లో ప్రవేశాలు దిగజారుతున్నాయి. ఆంగ్లమాధ్యమ మోజు, అసౌకర్యాలు, ప్రైవేటు, ప్రభుత్వ గురుకులాలు, ఆదర్శ పాఠశాలలకు పెరిగిన ఆదరణతో సర్కారు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయి తరగతుల్లో ఉపాధ్యాయుల కొరత, అసౌకర్యాలు, పర్యవేక్షణ లోపాలు వంటి కారణంగా తల్లిదండ్రులకు వాటిపై నమ్మకం కల్గడం లేదు. గతేడాది ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో 7023 మంది ఉండగా, ప్రసుతం వారి సంఖ్య 7062కు చేరింది. గతేడాది స్థానిక సంస్థల పాఠశాలల్లో 37,499 మంది విద్యార్థులు చదవగా, ప్రస్తుతం వారి సంఖ్య 33,956కు చేరింది. అంటే వాటిల్లో 3,543 మంది విద్యార్థులు తగ్గారు. కేజీబీవీల్లో గతేడాది 1475 మంది బాలికలుంటే ఈసారి సంఖ్య 1494కు పెరిగింది. ఆదర్శ పాఠశాలల్లో గతేడాది 5135 మంది విద్యార్థులుండగా, ఈ సారి వారి సంఖ్య 5364కు పెరిగింది. ప్రస్తుత విద్యా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో తల్లిదండ్రులు తమ ధోరణిని మార్చుకున్నారు. ప్రైవేటుకు దీటుగా ఆదర్శ, గురుకులం, కేజీబీవీలను ఏర్పాటు చేయడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను వాటిల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటిల్లోని సదుపాయాలు, బోధనకు ఆకర్షితులైన విద్యార్థులు ప్రవేశాలకు పోటీపడుతుండటంతో వాటిల్లో పోటీ పెరిగింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆదర్శ పాఠశాలల్లో అదనంగా ప్రతి తరగతికి 10 సీట్లు అదనంగా పెంచడం, జిల్లాలో ఈసారి కొత్తగా 6 మైనార్టీ గురుకులాలు, 5 బీసీ గురుకులాలను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో ప్రైవేటులో రుసుంల భారాన్ని భరించలేని తల్లిదండ్రులు, సర్కారు బడుల్లోని పలువురు కూడా తమ పిల్లలను వీటిల్లో చేర్పించడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు గండిపడిందని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.