రైతు రుణమాఫీ చేసి, పంటలన్నీ కొనుగోళ్లు చేసి రైతు ఆత్మహత్యల్ని నివారించాలి
జగన్ ఏడాది పాలనలో 600 మంది రైతులు ఆత్మహత్యః
టీడీపీ నేత కళా వెంకట్రావు
విజయవాడ జూన్ 10
రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తిచేసుకుని సంబరాలు జరుపుకుంటున్న జగన్ అండ్ కోకు రాష్ట్రంలో అన్నదాతల మరణమృదంగం కంటికి కనిపించడం లేదా? ఏడాది పాలనలో రాష్ట్రంలో 600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం జగన్ విధానాలకు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి ఏపీలో 15వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు రైతు రుణమాఫీ వల్ల ఆనాడు ఏపీలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. నేడు తండ్రి ఒరవడిని జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు. కరోనా సమయంలో రైతులు పండించిన పంటలను అరకొరగా కొనుగోలు చేసి జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేశారు. వైసీపీ నేతలే దళారుల అవతారం ఎత్తారు. పంట ఉత్పత్తులకు రవాణ, మార్కెట్ సదుపాయాలు కల్పించలేదు. తెలంగాణలో రూ.5వేల కోట్లతో పంటలను కొనుగోలు చేయగా.. ఇక్కడ రూ.వెయ్యి కోట్లతో మాత్రమే కొనుగోలు చేశారు. గిట్టుబాటు ధర లభించక అప్పులభారం పెరిగి రెండున్నర నెలల్లో వందలాది మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మిరప, పసుపు పెట్టుబడి ఎకరాకు రూ.1.50 లక్షలు అవుతుంటే సగం ఆదాయం కూడా దక్కలేదు. పప్పుధాన్యాలకు గిట్టుబాటు ధరలు లేవు. కూరగాయలు, బత్తాయి, అరటి రైతులు లాక్ డౌన్ లో తమ ఉత్పత్తులు అమ్ముకోలేక రోడ్డుపైనే పారబోశారు. అరటి గెల రూ.50కి పడిపోయింది. టమోట కేజీ రూ.2 కు పడిపోయింది. టీడీపీ హయాంలో ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమం ఎన్టీఆర్ జలసిరిని జగన్ రద్దు చేశారు. దీంతో అన్నదాతలు బోర్ల కోసం లక్షల రూపాయలు అప్పలు చేసే పరిస్థితి నెలకొంది. రబీలో 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరగగా.. కరోనా సమయంలో కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు. ధాన్యం రైతులకు రూ.వెయ్యి కోట్లకు పైగా బకాయిలు ఉన్నారు. తెలంగాణలో మనకంటే ఎక్కువగా ధాన్యం కొనుగోలు చేశారు. మద్యం అమ్మకాలకు అడ్డురాని నిబంధనలు రైతులు తీసుకెళ్లే కూరగాయల వాహనాలకు అడ్డురావడం దౌర్భాగ్యం. ఆక్వా, సెరీ కల్చర్ రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని ఎన్నికలకు ముంద హామీ ఇచ్చి మాట తప్పారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం ఇస్తామని చెప్పి.. కనీసం పట్టించుకున్న పాపాన లేదని అయన అన్నారు. రైతు భరోసా పేరుతో జగన్మోహన్ రెడ్డి దగా చేశారు. బడ్జెట్లో 64.06 లక్షల మందికి పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చి అమలులో మాత్రం 45,00,263 మందికి కుదించారు. 15.36 లక్షల మంది ఉన్న కౌలు రైతులను 1,58,123 మందికి తగ్గించారు. ఇది నమ్మకద్రోహం కాదా? రాష్ట్ర నిధుల నుంచి రూ.13,500, కేంద్రానివి రూ.6వేలు కలుపుకుని మొత్తం రూ.19,500 రైతు భరోసా కింద ఇవ్వాల్సి ఉండగా..రూ. 13,500 ఇస్తామంటే.. రూ.6 వేలు ఒక్కో రైతుకు ఎగనామం పెట్టారు. వాస్తవంగా రాష్ట్ర నిధుల నుంచి మూడు దఫాలుగా జగన ఇస్తున్నది రూ.7,500 మాత్రమే. ఐదేళ్లకు ఇస్తున్నది రూ.37,500 మాత్రమే. ఇచ్చిన హామీలో 30వేలు ఎగనామం పెట్టారు. చంద్రన్న అధికారంలోకి వచ్చిఉంటే అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.15వేలు చొప్పున రూ.75 వేలు, 4,5 విడతల రుణమాఫీ కింద రూ.40వేలు.. మొత్తం రూ.లక్షా 15వేలు అందేవి. టీడీపీ ప్రభుత్వం రాకపోవడం వల్ల ప్రతి రైతు రూ.77,500 నష్టపోయాడు. చంద్రబాబునాయుడు గారు రైతు రుణమాఫీ కింద రూ.15,279 కోట్లు చెల్లించడం జరిగింది. జగన్ వచ్చిన తర్వాత 4,5 విడతల రుణమాఫీ రద్దు చేసి అన్యాయం చేశారు. టీడీపీ పాలనలో వ్యవసాయ రంగంలో రెండెంకల వృద్ధిరేటు సాధించడం జరిగింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 3,556 కోట్లు వెచ్చించడం జరిగింది. నేడు జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటం తప్ప రైతులను ఆదుకున్నది శూన్యమని అయన అన్నారు.