ఎస్ఐ రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు
గుంటూరు జూన్ 10
ప్రేమజంటను బెదిరించి నగదు డిమాండ్ చేయడంతో పాటు, మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన అమరావతి ఎస్‌ఐ రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు తెలిపారు. మరోవైపు లైంగిక వేధింపులకు పాల్పడిన ఎస్‌ఐ రామాంజనేయులు, అతడి డ్రైవర్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. వారం రోజుల్లోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసేవిధంగా విచారణ పూర్తి చేయాలని జిల్లా రూరర్ ఎస్పీకి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలు ఇచ్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న ఆమె... ‘దిశ’ చట్టం స్పూర్తితో రాష్ట్రంలో మహిళల భద్రతకు అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో సాక్షాత్తూ రక్షణగా ఉండాల్సిన పోలీసులు కీచకులుగా మారితే చాలా కఠినంగా వ్యవహరించాలని జిల్లా పోలీస్ అధికారులకు సూచించారు.